విజయవాడ, జూలై 19,
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాటలకు అభిమానుల నుంచి వచ్చే రియాక్షన్ కంటే అధికార పార్టీ నేతల నుంచి ఎక్కువ స్పందన వస్తోంది. పవన్ చేసే విమర్శలకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదంతా వైసీపీ వ్యూహాత్మకంగా చేస్తున్నట్టుగానే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై అధికార వైఎస్సార్సీపీ నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ వచ్చింది. పవన్‌పై మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. నలుగైదు రోజులు ఏపీలో ఈ హంగామా నడిచింది. వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులు పవన్ కళ్యాణ‌్ పేర్కొనడాన్ని వైసీపీ అస్త్రంగా మలచుకుంది. పవన్ కళ్యాణ్‌పై రాజకీయంగా దాడి చేయడానికి వాలంటీర్ల వ్యవహారాన్ని అనుగుణంగా మలచుకుంది.పవన్ కళ్యాణ్-వాలంటీర్లు-వైసీపీ వ్యవహారం దాదాపు వారం రోజులు నడిచింది. గోదావరి జిల్లాల్లో వారాహిా యాత్ర నడుస్తున్న సమయంలోనే నెల్లూరులో టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర కూడా సాగింది.పవన్ కళ్యాణ్ మాదిరే లోకేష్ నిత్యం వైసీపీని విమర‌్శిస్తూ యాత్ర సాగిసస్తున్నారు. తమ పార్టీ నేతలకు భరోసా కల్పించడంతో పాటు, అభివృద్ధి విషయంలో సవాళ్లు విసురుతున్నారు.పవన్ కళ్యాణ్, లోకేష్‌ల యాత్ర ద్వారా తమ పార్టీలకు ప్రజల్లో పట్టు తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీల మధ్య పోటీ వాతావరణాన్ని కల్పించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వనని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి చేటు జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు పవన్ కళ్యాణ్‌కు అవసరానికి మించి ప్రాధాన్యత కల్పిస్తుందనే వాదన ఉంది. మరోవైపు టీడీపీ,జనసేన కలిసి పోటీ చేస్తే తమకు లబ్ది కలుగుతుందనే ఆలోచన కూడా వైసీపీలో ఉంది.వైసీపీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ ఓటు బ్యాంకులను సుస్థిరం చేసుకోడానికి వీలవుతుందనే భావన ఆ పార్టీలో ఉంది. జనసేన, టీడీపీలు కలిస్తే రెండు బలమైన సామాజిక వర్గాలు అధికారం కోసం ఏకమవుతున్నాయనే సందేశాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో ప్రచారం చేయొచ్చని వైసీపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి 40శాతం, జనసేనకు దాదాపు ఏడు శాతం ఓట్లు లభించాయి. రెండు కలిస్తే వైసీపీకి వచ్చిన 49శాతం ఓట్లను చేరుకోవడం సులువని ఆ పార్టీలు భావిస్తున్నాయి.