అనంతపురం, జూలై20,
పట్టుదల ఉంటే పేదరికం అనేది అడ్డుకాదని.. చదవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు, వయస్సు అసలు ఆటంకమే కాదని నిరూపించింది ఓ మహిళ. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ మహిళ. దినసరి కూలీగా ఎండనకా, వానెనకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో ఎట్టకేలకు రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ మహిళ చదువుపై తనకున్న మక్కువతో రాత్రీ, పగలూ కష్టపడి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసింది. అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే మారుమూల గ్రామానికి చెందిన సాకే భారతి విజయగాథ ఇది.నాగులగుడ్డం ఓ మారుమూల పల్లె. ఆ పల్లెలో సాకే భారతి అనే మహిళ నివాసం ఉంటోంది. ఓ రోజు ఆ ఊరి చివర ఓ చిన్న రేకుల షెడ్డు ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, మరింత సంతోషం. ఎందుకంటే.. నిత్యం తమతోపాటు కూలి పనులకొచ్చే భారతి డాక్టర్ అయ్యింది. అది మెడిసిన్ చదివిన డాక్టర్ కాదు.. చదువులతల్లి కరుణిస్తే వచ్చిన డాక్టరేట్. ఆమె కోచింగ్‌లకు వెళ్లలేదు, ఎక్స్ ట్రా క్లాసెస్ లేవు. మిస్ట్రరీలాంటి కెమిస్ట్రీని ఒంటిచేత్తో చదివేసింది. ఆ తరువాత ఆమెకు అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో.. పీహెచ్‌డీ పట్టా బహూకరించారు. అక్కడికి వేదిక మీదకు భర్త, కూతురుతో కలిసి వచ్చింది భారతి. పారగాన్ చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారందరూ. ఆ సమయంలో కూడా ఆమెలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది.సాకే భారతికి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలనుకుని ఉండేది. పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో పూర్తిచేసింది. ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలే కావడంతో వారు ఆమెకు పెళ్లిచేయాలని నిశ్చయించుకున్నారు. ముగ్గురిలో ఆమె పెద్దది కావడంతో వీరందరి బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక మేనమామ శివప్రసాద్‌తో తనకి పెళ్లి చేశారు. భవిష్యత్తు గురించి ఎన్ని కలలున్నా…ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది. అయినా ఆమె నిరాశ చెందలేదు. అతడే ఆమె కోరికను అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదో అవకాశం అనుకుంది. కూలీ పనులకు వెళుతూనే అనంతరపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించలేక.. తన ఊరి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్కుఎక్కేది. ఈ సమయంలోనే భారతి, శివప్రసాద్ దంపతులకు కూతురు గాయత్రి పుట్టింది.కుటుంబ పోషణ కోసం ఉదయం పనులకు పోయి.. సాయంత్రం ఇంటికి వచ్చి చదువుకునేది. ఈ క్రమంలో పీజీ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయితే.. పీహెచ్‌డీ చేయాలని అధ్యాపకులు ప్రోత్సహించడంతో.. పీహెచ్‌డీ చేయాలనే బలంగా నిశ్చయించుకుంది. ప్రయత్నిస్తే ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందుకోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయపడింది. అయినా.. తను కూలి పనులు చేయడం మాత్రం మానలేదు. డాక్టరేట్ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది తమ జీవితాల్ని బాగు చేస్తుంది. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మందికి పంచొచ్చు. తాను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది… ఇవన్నీ తనను నడిపించాయి అంటోంది చదువుల భారతి. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ఎదుర్కొని ఓ ఆదర్శంగా మారింది డాక్టర్ సాకే భారతి.