విజయవాడ
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కలిసికట్టుగా పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి.
ఎన్డీయే కూటమి భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తుల అంశంపై మరోసారి స్పందించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని తెలిపారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని.. అవి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కచ్చితంగా మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. 2014లో ఎలాగైతే కలిసి అధికారంలోకి వచ్చామో.. 2024లో కూడా అలాగే పవర్లోకి వస్తామని పేర్కొన్నారు.
సీఎం పదవి ముఖ్యం కాదు..
జనసేన కార్యకర్తలు తనను సీఎం చేయాలని అనుకుంటున్నారని.. అయితే క్షేత్రస్థాయి బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని మరోసారి స్పష్టంచేశారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. ఫలితాలు వచ్చాక సీట్లను బట్టి సీఎం పదవి గురించి ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చారు.