విజయవాడ, జూలై 21,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. టీడీపీ, బీజేపీ పొత్తుపై మద్దతు కూడగట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని జోరుగా చర్చ సాగుతోంది. అమిత్ షా తో పవన్ భేటీ అనంతరం ఈ చర్చ మరింత పెరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. బుధవారం ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీలో తాజా రాజకీయాలతో పాటు పొత్తులపై చర్చించినట్లు సమాచారం. బుధవారం దిల్లీలోనే ఉన్న పవన్... సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా 15 నిమిషాల పాటు వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం దిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను చర్చించినట్టుగా తెలుస్తోంది. గురువారం కూడా పవన్ దిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఈ పర్యటనలో పవన్ ఇంకెవరిని కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తులపై పవన్ బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఎన్డీఏ సమావేశంలో ఏపీ విషయాలు ప్రస్తావనకు రాలేదని పవన్ కల్యాణ్ మీడియాతో అన్నారు. పవన్ ప్రకటనతో ఏపీని బీజేపీ లైట్ తీసుకుందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. పొత్తు పెట్టుకున్నా, పొత్తులు లేకపోయినా తమకు వచ్చే నష్టమేం లేదని భావిస్తున్న బీజేపీ... ఏపీలో వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తుంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ...వైసీపీకీ టచ్ లో ఉంది. అవసరం వచ్చినప్పుడు వైసీపీ బయట నుంచి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నా... ఆ విషయంలో బీజేపీ ఇంకా స్పందించలేదు. టీడీపీతో కలిస్తే వైసీపీ దూరమవుతుందని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం పొత్తులపై క్లారిటీ ఇవ్వడంలేదు. టీడీపీ, వైసీపీకి సమాన దూరంలో ఉంటూ రెండు పార్టీల మద్దతు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే జనసేన అధినేత పవన్ మాత్రం వైసీపీని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీని దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ , టీడీపీ, జనసేన కూటమి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం రాకుండా చేయడమే జనసేన విధానం అని ప్రకటించారు. అందుకోసం ఏ నిర్ణయానికైనా సిద్ధపడతామన్నారు. ఎన్డీఏ సమావేశానికి దిల్లీ వెళ్లిన పవన్ పొత్తులపై బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన, బీజేపీకి కలిగే ఉపయోగాలను బీజేపీ అధిష్ఠానం దృష్టికి పవన్ తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీలో పవన్ కల్యాణ్ ఇంకా ఎవరిని కలుస్తారు. పొత్తులపై ఏదైనా స్పష్టత వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జరిగిన సమావేశంపై పవన్ సోషల్ మీడియాలో స్పందించారు. హోంమంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశం ఏపీ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు దారితీస్తుందని కచ్చితంగా నమ్ముతున్నానని పవన్ అన్నారు. అమిత్ షాతో పవన్ భేటీపై ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పొత్తులపై చర్చించారా? బీజేపీ ఎలా స్పందించింది? ఇంతకీ టీడీపీతో పొత్తులంటాయా? అంటూ చర్చలు సాగుతున్నాయి.