తిరుమల వెంకన్న సన్నిధిలో నెలకొన్న వివాదాలు సమసిపోక మునుపే కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు ఏకంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకున్నప్పటికీ వివాదాలకు ఫుల్‌స్టాప్ పడకపోవడం గమనార్హం. టీటీడీలో ప్రధానార్చకుడిగా రమణ దీక్షితులును తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన తొలగింపుతో మొదలైన వివాదం శ్రీవారి నగలు, వజ్రాలు వరకూ వెళ్లింది.ఇదిలా ఉంటే.. ప్రధానార్చకులుగా తమనే నియమించాలని గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు డిమాండ్ చేస్తున్నారు. మిరాశీ వ్యవస్థను రద్దు చేసిన తరువాత తమ కుటుంబాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమణ దీక్షితుల తరువాత తామే సీనియర్లమని చెబుతూ, ప్రధానార్చక హోదా కోసం ఈఓకు లేఖలు పంపడం జరిగింది. ఈ లేఖలపై టీటీడీ నుంచి కనీస స్పందన రాలేదుమరోవైపు.. టీటీడీ ఉద్యోగులు నేడు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. తిరుపతిలోని వివిధ టీటీడీ అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు మాత్రమే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దీంతో శ్రీవారిపైనే మీ నిరసనా..? అంటూ కొందరు ప్రముఖులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. భక్తుల నుంచి వచ్చిన విమర్శలతో ఈ నిరసనలు తిరుపతికి మాత్రమే పరిమితం అయ్యాయి.ఇంతకాలం ఏపీకి మాత్రమే పరిమితమైన తిరుమల వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకుంటోంది. స్వామివారి ఆభరణాలు మాయమైన వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండు చేస్తూ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు హస్తిన వేదికగా నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రమణ దీక్షితులు.. అక్కడే బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామితో చర్చలు జరుపుతున్నారు.