తిరుపతి, జూలై 21,
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటివరకు అందిన సర్వేల నివేదికల ఆధారంగా... మార్పులపై చర్చించే అవకాశం ఉంది.ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి... సంచలన విజయాన్ని అందుకున్న వైసీపీ... ఈసారి కూడా సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మైత్రి ఖరారయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే పవన్ తీవ్రస్థాయిలో వైసీపీపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే తమ లక్ష్యమని... అందుకోసం కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కూడా చెప్పారు. ఫలితంగా ఏపీలో మరోసారి కూటమి తెరపైకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న వైసీపీ... పక్కాగా అడుగులు వేయాలని చూస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు అందుకున్న అధినేత... పార్టీ, ప్రభుత్వ పరంగా పలు నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ వినిపిస్తోంది.వచ్చే నెల మూడో వారం నుంచి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు సిద్ధమయ్యాయి. ఇవన్నీ కూడా జగన్ చేతికి అందినట్లు సమాచారం. స్వాతంత్ర దినోత్సవం తర్వాత వరస సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్న జగన్... ఈలోపు కొన్ని రీజినల్ ఇంఛార్జీలను మార్చాలని చూస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ, మార్పులపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఇంతేకాకుండా మీడియా, సోషల్ మీడియా, నేషనల్ మీడియా ప్రముఖులతో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. వారిచ్చే నివేదికలు ఇతర సంస్థల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరో వైపు టీటీడీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు ముఖ్యమంత్రి జగన్ పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డిఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. రెండో టర్మ్ కూడా పూర్తి కావొస్తోంది. దీంతో ఆయన స్థానంలో జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇచ్చే ఉంది.