కడప, జూలై 21,
ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ అధికార పార్టీ వైసీపీకి ఎదురుగాలి ఎక్కువ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు.. ప్రజలలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. గతంలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు, కంచుకోట లాంటి నియోజకవర్గాలు కొన్ని ఇప్పటికే వైసీపీకి దూరమయ్యాయి. అవి కాకుండా మరి కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు అధిష్టానంతో ఆంటీ ముట్టనట్లు ఉండగా.. మరికొందరు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ముందే ఓ అడుగు ముందుకేస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీకి కంచుకోట ఉమ్మడి కడప జిల్లాలోని స్థానం కూడా ఉండడమే విశేషం. అదే రాజంపేట. రాజంపేట రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంతో పాటు.. దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గత ఎన్నికలలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు మరోసారి అదే టార్గెట్‌గా అడుగులు వేస్తోంది. అయితే, నేతలలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గత నాలుగేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో మసకబారిన వైఎస్ కుటుంబ ప్రతిష్ట, సొంత జిల్లాను సైతం సీఎం జగన్ పట్టించుకోకపోవడం లాంటి కారణాలు ఈసారి వైసీపీని దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే నేతలు ముందే మెల్లగా పార్టీకి దూరమవుతున్నారు. అందుకు తగ్గట్లే టీడీపీ కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ పావులు కదుపుతుంది. ఇక్కడ అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే సోదరుడిని పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం రాజంపేట అసెంబ్లీ స్థానం నుండి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా మల్లిఖార్జున రెడ్డి.. 2012 ఉప ఎన్నికల్లో రాజంపేటలో కాంగ్రెస్ తరపున పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి చేతిలో ఓడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ ఆయనకు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా చీఫ్ విప్ పదవి ఇచ్చి ప్రోత్సహించింది. అయితే, 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి వెళ్లారు. అక్కడ మళ్ళీ గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మల్లిఖార్జున రెడ్డి ఆలోచన చేస్తున్నారు.కానీ, ఈ నాలుగేళ్ళలో మేడా మల్లిఖార్జున రెడ్డిపై రాజంపేటలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఒకదశలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. 'మా నమ్మకం నువ్వే జగనన్నా.. కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మీద మాకు నమ్మకం లేదు' అంటూ పోస్టర్లు అంటించారు. ‘ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డీ.. మీ మీద మాకు నమ్మకం లేదు.. ఇట్లు మోసపోయిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు’ అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో ఆయనకు ఈసారి జగన్ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలున్నాయి. అందుకు తగ్గట్లే మల్లిఖార్జునరెడ్డి కూడా పెద్దగా ఫోకస్ లోకి రావడం కూడా లేదు. అయితే, గత రెండేళ్లుగా మల్లిఖార్జున రెడ్డి తమ్ముడు విజయశేఖరరెడ్డి టీడీపీలో చేరనున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. గత రెండుసార్లు అన్న విజయంలో తమ్ముడు కీలకపాత్ర పోషించారు. అయితే, 2019 ఎన్నికల అనంతరం అన్నదమ్ముల మధ్య సఖ్యత కొరవడిందని చెప్పుకుంటున్నారు. ప్రజలలో పెరిగిన అసంతృప్తి, మరోవైపు అన్నతో సఖ్యత లేకపోవడంతో గత ఏడాదినే విజయశేఖరరెడ్డి టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ముహూర్తం కుదిరింది. చంద్రబాబును కలిసిన విజయశేఖర్ రెడ్డి తనకు టీడీపీపై ఆసక్తి ఉందని.. అవకాశం ఇస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టారు. రాజంపేటకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇందులో తన సోదరుడు మల్లికార్జునరెడ్డి పాత్ర కూడా ఉందని విజయశేఖరరెడ్డి ఆరోపించారు. ప్రధానంగా జిల్లాల విభజన సమయంలో రాజంపేటకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విజయశేఖరరెడ్డి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ను కూడా బయటపెట్టారు. విజయశేఖరరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు కలిసి పనిచేసి టీడీపీని గెలిపిద్దామని అన్నారు.