గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం పద్మ అవార్డుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పద్మ అవార్డు గ్రహితలందరికీ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా పద్మ విభూషణ్ గ్రహిత మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, కిడాంబి శ్రీకాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రటించిన అవార్డుల జాబితాలో ఇంకొందరు తెలుగువారుంటే బాగుండేదన్నారు. సినీ నటి సావిత్రికి పద్మ అవార్డు ఇస్తే బాగుండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్వీఆర్, సావిత్రికి పద్మ అవార్డులు ఇప్పించేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అవార్డుల విషయంలో పవన్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
"ఇప్పుడున్న చిన్నపిల్లలు, ట్వంటీస్‌లో ఉన్నవారు స్వతంత్ర సమరయోధులు పడ్డ కష్టాలు, వారి చరిత్ర గురించి ఒక్కసారి చదివితే మనం ఎందుకు ఆగస్ట్ 15, రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామో తెలుస్తుంది. ఈ స్పూర్తి విలువలు, కష్ట నష్టాలు, త్యాగాలు నాకు తెలుసు కాబట్టే నేను రాజకీయాల్లోకి రావడానికి, ప్రజలకు సేవచేయడానికి ముఖ్య కారణమైంది. మున్ముందు మీ సహాయసహకారాలు పార్టీకి, దేశానికి కావాలి. వ్యక్తి, పార్టీల కంటే దేశం, సమాజం చాలా గొప్పవి"అని పవన్ చెప్పుకొచ్చారు.