YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కూనుకుంట్ల రివర్స్ గేర్....

కూనుకుంట్ల రివర్స్ గేర్....

కరీంనగర్, జూలై 22, 
రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినా….ఏక మొత్తంలో ఎగిరినా… మొత్తానికి టాప్‌ పొజిషన్‌లోకి వెళ్ళాలన్నది నాయకులందరి కల. కాలం కలిసి రాకున్నా, ఏటికి ఎదురీదాల్సి వచ్చినా… ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకుపోతారు పొలిటికల్‌ లీడర్స్‌. కానీ… మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ ఆలోచన మాత్రం అందుకు రివర్స్‌లో ఉందట. ఆయన మాటలు విని సొంత కేడర్‌ సైతం ఈయనకేమైంది? ఇలా మాట్లాడుతున్నారని ముక్కున వేలేసుకుంటున్నారట. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తాను ఈసారి జడ్పీటీసీగా పోటీ చేస్తానని, అది కూడా ఎక్కడి నుంచైతే బాగుంటుందని సన్నిహితులను అడగడంతో నోళ్ళెల్లబెట్టడం వాళ్ళ వంతైందట. విషయం ఆనోటా, ఈనోటా పడి కేడర్‌కు చేరడంతో… వాళ్ళు కూడా ముందు షాకై… తర్వాత ఇదెక్కడి రివర్స్‌ టెండరింగ్‌… రా… బాబూ అని సెటైర్లు వేసుకుంటున్నారట.సాధారణంగా ఎమ్మెల్యే అయిన వారు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుంటారు. కుదరదంటే.. కనీసం మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అదీ.. ఇదీ పోయి… ఐపీఎస్‌ ఆఫీసర్‌ వచ్చి కానిస్టేబుల్‌ డ్యూటీ చేస్తానన్నట్టు… ఎమ్మెల్యే… జడ్పీటీసీగా పోటీ చేయడం గురించి ఆలోచించడమేంటి? మళ్ళీ దానికోసమో చర్చ జరపడమేంటీ? ఆసలీయనగారికి ఏమైందంటూ చెవులు కొరుక్కుంటున్నారట అనుచరులు. కానీ… ఎవడేమనుకుంటే.. మాకేంటి? మా లెక్కలు మాకున్నాయంటున్నారట కూసుకుంట్లకు అత్యంత సన్నిహితులు. జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అవుదామనుకుంటున్నారట ఆయన. అలా ఎందుకయ్యా… అంటే.. దానికీ ఓ లెక్కుందట. వామపక్షాలతో పొత్తు ఓకే అయితే ఈసారి మునుగోడు సీటును ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తారన్నది ఎమ్మెల్యేకున్న సమాచారం అట. దానికి తోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రాఫ్ సరిగా లేదని అధిష్టానం దగ్గర కూడా రిపోర్ట్‌ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నాడు ఉప ఎన్నికల సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదన్న కోణంలో మాత్రమే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇచ్చారని, కానీ ఈసారి అది సాధ్యం కాకపోవచ్చన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఖాయమనే వాదన గట్టిగానే ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే కూసుకుంట్ల జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి వైపు మొగ్గుతున్నారన్నది ఆయన సన్నిహితుల వాయిస్‌.2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కూసుకుంట్ల ఇదే ప్రయత్నం చేసినా… అప్పుడు సాధ్యపడలేదు. అదే ప్రతిపాదనను తిరిగి తీసుకు రావడంతో ఎకసెక్కాలు కూడా ఎక్కువయ్యాయట. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలు యాదాద్రి జిల్లాలో, నాలుగు మండలాలు నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నాయి. మరి ఆయన గారు ఏ జిల్లాకు జడ్పీ ఛైర్మన్‌ అవుదామనుకుంటున్నారో సెలవియ్యాలని వెటకారంగా మాట్లాడుకుంటున్నారట. మరోవైపు నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాలకు చెందిన నలుగురు ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టడం హాట్‌ టాపిక్‌ అయింది. ఎమ్మెల్యే తీరు వల్లే ఇదంతా అని చర్చ జరుగుతుండగా…. సొంత నేతలపై అవిశ్వాసాల నోటీసులు మంచి పరిణామం కాదని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఆ తీర్మానాల వెనక ఎమ్మెల్యే ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2018లో ఓటమి తర్వాత తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఉప ఎన్నికల సమయంలో సహకరించలేదన్న కారణంతో ఎమ్మెల్యే అవిశ్వాసాల పేరుతో స్థానిక నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. మొత్తం మీద ఈసారి మునుగోడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మార్పు తప్పదని తేలిపోయింది. పొత్తులో లెఫ్ట్‌కు ఇస్తారా లేక మరో గెలుపు గుర్రాన్ని రేసులోకి తెస్తారా అన్నది చూడాలి.

Related Posts