YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాత కాపులకే మళ్లీ టిక్కెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీ కాంగ్రెస్ లిస్ట్

పాత కాపులకే మళ్లీ టిక్కెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీ కాంగ్రెస్ లిస్ట్

హైదరాబాద్, జూలై 22, 
కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరుతో ఓ సర్వే రిపోర్టు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నది. లీడర్లలో అసంతృప్తికి కారణమవుతున్నది. ముందు నుంచీ హస్తం పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నా సీటు దక్కదేమోననే టెన్షన్ ఆ పార్టీ లీడర్లలో మొదలైంది. ఏ సెగ్మెంట్‌లో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమనే విషయాన్ని ఆ లిస్టు ద్వారా సిఫారసు చేసినట్టు టాక్. ఈ జాబితాను చూసిన కాంగ్రెస్ నేతలు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. అందులో దాదాపు సగానికి పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పేర్లే ఉండటంతో ముందు నుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న లీడర్లు ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో సెకండ్ ప్రయారిటీ పేరుతో పెట్టిన పేర్లు కాంగ్రెస్ నేతల మధ్య చర్చకు దారితీసింది. ఈ లిస్టు ఫైనలా? లేక ఏఐసీసీ మార్పులు చేస్తుందా?.. ఇప్పటి నుంచే హైకమాండ్ దగ్గర పైరవీలు చేసుకోవాలా?.. ఇది పాత రిపోర్టా?.. లేక కొత్తదా?.. యాధృచ్ఛికంగానే బయటకు లీకైందా?.. లేక ఉద్దేశపూర్వంగా దొడ్డిదారిన ఎవరైనా లీక్ చేయించారా? అనే సందేహాలు పార్టీ నేతల్లో మొదలయ్యాయి.కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్‌గా సర్వే రిపోర్టును ప్రకటించికపోయినా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించిన ఓ లిస్టు పార్టీ లీడర్ల ఫోన్లలో చక్కర్లు కొడుతున్నది. కొన్ని నియోజకవర్గాలకు ఒక్క పేరును మాత్రమే ప్రతిపాదించగా, మరి కొన్నింటికి మాత్రం సెకండ్, థర్డ్ ప్రాబబుల్స్ పేర్లను ప్రపోజ్ చేసినట్లు స్పష్టమవుతున్నది. పార్టీలో ఇంటర్నల్‌గా లీకైన ఆ సర్వే రిపోర్టు నిజమేనని ఓ కీలక నేత ధృవీకరించారు. ఇది ఏఐసీసీకి పంపడం కోసం సునీల్ కనుగోలు రూపొందించారని ఆ నేత పేర్కొన్నారు. ఈ జాబితాలో దాదాపు 75% సీట్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల పేర్లు ఉండటం గమనార్హం. ఇదే విషయం పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. అసంతృప్తికి కారణమైంది. మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్నా టికెట్‌కు నోచుకోలేకపోయామా? అని బాధపడుతున్నారు. ఎక్కువ నియోజకవర్గాల్లోని ఆశావహులు, అసంతృప్తివాదులు, రేసు గుర్రాలు ఢిల్లీలోని హై కమాండ్‌ను ఆశ్రయించాలని భావిస్తున్నారు. టికెట్ కోసం పైరవీలు, ప్రయత్నాలు తప్పదనే ఆలోచనలో పడ్డారు. అవసరమైతే సీనియర్ల సహాయాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీకైనా ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను వారికి వివరించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సునీల్ కనుగోలు రిపోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు ప్రమేయంలేదనే నేతలు నమ్ముతున్నారు. అందువల్లే ఆయనకు సంబంధం లేకుండా ఢిల్లీకే వెళ్లాలని ఫిక్స్ అవుతున్నట్టు సమాచారం. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.51 నియోజకవర్గాల్లో ఇద్దరి చొప్పున పేర్లను సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ప్రతిపాదించారు. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నేతల పేర్లు సైతం ఈ జాబితాలో ఉండటం సరికొత్త సందేహాలకు దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్ములో మంత్రిగా పనిచేసి బయటకు వచ్చిన ఓ నేత ప్రస్తుతం ఓ జాతీయ పార్టీలో కీలక పోస్టులో కొనసాగుతున్నారు. ఆయన పేరు సైతం ఈ లిస్టులో ఉండటం గమనార్హం. కేసీఆర్ ఇటీవల ఓ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఇంటికి రావాలంటూ ఆహ్వానించిన ఒక నేత పేరు కూడా ఇందులో ఉన్నది. 68 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో మాత్రం ఎలాంటి కాంపిటేషన్ లేదని ఈ లిస్టును బట్టి తెలుస్తున్నది. ఆ నియోజకవర్గానికి ఒక్కో పేరు చొప్పునే లిస్టులో ప్రతిపాదించారు. మరో నియోజకవర్గంలో మాజీ పీసీసీ అధ్యక్షుడి పేరును రెండవ ప్రయారిటీ కింద పెట్టడంతో ఆయన షాక్‌లో ఉన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మాజీ మంత్రి భార్యభర్తల బెర్తులు ఈ జాబితాలో ఖరారు చేశారు. అంతేగాక ఓ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఆయన భార్య పేర్లు కూడా టిక్కెట్ జాబితాలోకి ఎక్కాయి. బీఆర్ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తూ మేయర్ పదవి ఆశించి అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ కార్పొరేటర్, వారి తమ్ముడి పేరు కూడా టిక్కెట్ల పంపిణీ జాబితాలో రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాయి. అదే నియోజకవర్గంలో రేవంత్ సన్నిహితుడి పేరు మాత్రం సెకండ్ ప్రయారిటీలో ఉన్నది. కొంత మంది లీడర్ల పేర్లు ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఆప్షనల్‌గా కనిపించాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ సీఎం కూతురు పేరు కూడా ఈ జాబితాలో ఉన్నది. ప్రస్తుతం పార్టీలో లేని వారికి కూడా టిక్కెట్లు రిజర్వు కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చంశనీయంగా మారింది.సర్వే రిపోర్టు లీకైన విషయం తెలుసుకొని పలు నియోజకవర్గాల ఇంచార్జిలు టీపీసీసీ, ఏఐసీసీకి చెందిన ముఖ్య లీడర్లకు ఫోన్లు చేశారు. ‘అన్నా లిస్టులో మా పేరు ఉన్నదా?’ అంటూ ఆరా తీశారు. ఉన్నోళ్లకు ఓకే చెబుతూనే మరో వైపు పేరు లేనివాళ్లకు ఇది ఫైనల్ లిస్టు కాదనే ఆన్సర్ ఇస్తున్నారు. ఇది సర్వే మాత్రమేనని, ఏఐసీసీ తర్వాత ఫైనల్ లిస్టును రిలీజ్ చేస్తుందని సర్దిచెప్తున్నారు. లీకైన లిస్టుతో నెలకొన్న అసంతృప్తిని ఈ రూపంలో చల్లబరుస్తున్నారు. సర్వే రిపోర్టుతో సంబంధం లేకుండానే సునీల్ కనుగోలు టీమ్ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై ఓ సీనియర్ నేత గతంలో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. విషయాన్ని నేరుగా రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.కాంగ్రెస్ స్ట్రాటెజిస్ట్ సునీల్ కనుగోలు చేసిన సర్వేపై అనుమానాలూ వస్తున్నాయి. పార్టీకి గుర్తింపు తెస్తూ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో తిరిగినోళ్ల పేర్లు ఆ జాబితాలో లేకపోవడమే ఇందుకు నిదర్శమనంటూ వారికి వారు సర్దిచెప్పుకుంటున్నారు. ఏఐసీసీకి పంపిన ఈ రిపోర్టు ఉద్దేశంపైనే సందేహాలున్నాయని ఓ నేత వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలో చేరిన ఓ మాజీ ఎంపీ అనుచరుల పేర్లు ఐదారు నియోజకవర్గాల్లో కనిపించడాన్ని సదరు నేత జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో చేరిన నెల రోజుల్లోనే గెలుపు పక్కా అంటూ రిపోర్టు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. సర్వే రిపోర్టు తయారీ సమయంలోనే లోపాయికారీగా ఒప్పందాలు జరిగాయేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఈ గందరగోళంపై నిర్దిష్టమైన క్లారిటీ ఇవ్వకపోతే 50% నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్లో కన్‌ప్యూజన్ నెలకొనే ప్రమాదమున్నది.

Related Posts