YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రాజెక్టులకు జలకళ

ప్రాజెక్టులకు జలకళ

విజయవాడ, జూలై 24, 
ఎడతెరిపి లేని వానలతో ఉక్కిరిబిక్కిరౌతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎగువన కురుస్తున్న కుండపోత కారణంగా గోదావరి నదిపై ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి పది అడుగుల దిగువకు చేరుకుంది వరద. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోనూ ఇదే జలదృశ్యం రిపీటైంది. నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులో గరిష్టస్థాయికి చేరుకుంది నీటిమట్టం. కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉధృతి పెరుగుతోంది. రెండు రోజులుగా హెచ్చుతగ్గులతో దోబూచులాడుతోంది గోదారి నీటిమట్టం. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కరకట్ట వద్ద స్నానఘట్టాలు మునిగిపోయాయి. మళ్ళీ వరద పెరిగే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు అధికారులు.తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 27 గేట్లు ఎత్తివేసి 27 వేల 541 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లైతే… ప్రస్తుత నీటిమట్టం 72.50 మీటర్లు. అటు… అదుపు తప్పి పొంగి ప్రవహిస్తోంది పెన్‌గంగ. హైవేను ముంచెత్తి.. సరిహద్దు గ్రామాల్ని రౌండప్‌ చేసింది.ఏపీలో గోదారి జిల్లాలపైనా పగబట్టింది వరద. రాజమండ్రిలో ఉగ్రరూపం దాల్చింది గోదావరి. గంటగంటకూ పెరుగుతున్న నీటి ఉధృతి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. నది పరివాహక ప్రాంతాల్ని ఖాళీ చేయించారు. రాజమండ్రిలోని స్నాన ఘట్టాల గేట్లు మూసివేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. వైనతేయ, వశిష్ట, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేలపైకి వరద నీరు చేరి లంక భూములు కోతకు గురవుతున్నాయి. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో వరద నీటితో చిక్కుకున్నాయి లంక గ్రామాలు. వరద పోటుకు పంటలన్నీ నీట మునిగాయి. అరటి, కూరగాయల పంట భూములన్నీ నదిని తలపిస్తున్నాయి. లబోదిబోమంటున్నాడు రైతన్న.రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిపై నిషేధాజ్ఞలు విధించారు. గామన్‌ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలను దారిమళ్లించారు. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పేలా లేవు. 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎమ్‌డీ. ఏపీకి మరో వారంపాటు భారీ వర్ష సూచన ఉంది. ఉత్తర కోస్తాలో అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. దీంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టాలపై నిఘా పెట్టింది ఇరిగేషన్ యంత్రాంగం.

Related Posts