YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ వల

ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ వల

నల్గోండ, జూలై 25, 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే వివిధ పార్టీల నేతలను పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది. అధికార బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు వివిధ పార్టీలలో ఉన్న ముఖ్యమైన నాయకులు కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట నల్లగొండ జిల్లాను వరుస ఎన్నికల్లో జయ కేతనం ఎగురవేస్తూ మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కొండగా మార్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వివిధ పార్టీలలో మంచి గుర్తింపు ఉన్న నాయకులు, కార్యకర్తలను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. మిగిలిన నేతలు తమ పార్టీకి ప్రయోజన కరంగా ఉంటారు.. అనుకుంటే వెంటనే పావులు కదుపుతూ వారిని పార్టీలలో చేర్చుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు, భట్టి విక్రమార్క పాదయాత్ర, పొంగులేటి ఖమ్మం సభతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు.. వచ్చే ఎన్నికల్లో 12 స్థానాలకు 12 కాంగ్రెస్ గెలుచు కుంటుందని ప్రతిసారి సవాల్ విసురు తున్నారు. కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసే వ్యూహంలో భాగంగానే యాదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారట. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్ కుమార్ రెడ్డి ఓటమి చవిచూసినప్పటికీ పార్టీని అంటి పెట్టుకున్నారు. అప్పటినుంచి అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు మంత్రి జగదీష్ రెడ్డితో పాటు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారట. ఈ నేపథ్యంలో తాజాగా కుంభం అనిల్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై విమర్శలు గుప్పించి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజనేతలంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెంచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ హేమాహేమీలైన జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నేతలను ఓడించి కాంగ్రెస్ ను కంగుతినిపించింది. వచ్చే ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటినుంచి పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనే లక్ష్యంతో గులాబీ అధినేత కేసిఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే మరికొందరు కాంగ్రెస్ నేతలను గులాబీ దళంలో కలుపుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్ర నేతలు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీని ఎన్నికల నాటికి నిర్వీర్యం చేయడం ద్వారా దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్ ప్రభావానికి అడ్డుకట్ట వేయవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు భువనగిరి నియోజకవర్గంలోని ఎంపీపీలు, సర్పంచులకు గులాబీ కండువా కప్పింది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరికొందరు కాంగ్రెస్ నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి పావులు కదుపుతున్నారట. కుంభం అనిల్ కుమార్ రెడ్డి దారిలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు పయనిస్తారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ దిగ్గజనేతలు గులాబీ కండువా కప్పుకుంటారని పలుమార్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చే సమయం వరకు చేరికల ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.

Related Posts