YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్?

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్?

ముంబై జూలై 25
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలపై నేతల తిరుగుబాటుతో ఇప్పటికే మహా రాజకీయాలు సంచలనంగా మారాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతే కాకుండా పవార్‌ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించే వాడీవేడిగా చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో మహా ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ కొందరు ఇప్పటికే వ్యాఖ్యానించారు కూడా. మహా ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా ఇటీవలే మాట్లాడారు. ఆగస్టు 10 నాటికి షిండే స్థానంలోకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ వస్తారని వ్యాఖ్యానించారు. వార్తల నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి మార్పుపై స్పష్టతనిచ్చారు. అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ఎదగబోరని.. ఏక్ నాథ్ షిండేనే సీఎం పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘మహాకూటమి నాయకుడిగా నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగుతారు. ఇందులో ఎటువంటి మార్పూ ఉండదు’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.‘పార్టీ కార్యకర్తలు తమ నాయకుడు సీఎం కావాలని కోరుతూ అప్పుడప్పుడు తమ అంచనాలను వ్యక్తం చేయొచ్చు. ఇది సహజం. అయితే, ఆగస్టు 10న జరిగే సంఘటనల గురించి పృథ్వీ బాబా చెప్పిన అంచనాలు నిజం కావు. త్వరలో జరగబోయేది పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ. అందుకోసం సీఎం షిండే తేదీని ఖరారు చేస్తారు’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Related Posts