న్యూఢిల్లీ జూలై 25
ఇటీవల విపక్ష పార్టీలు తమ కూటమి పేరును ఇండియాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్. మొత్తం 26 విపక్ష పార్టీల కలయికే ఇండియా అని ఇటీవల జరిగిన బెంగుళూరు భేటీలో కాంగ్రెస్ నేత ఖర్గే పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమిని ప్రధాని మోదీతీవ్రంగా విమర్శించారు.విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని విపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రధాని మోదీ ఇవాళ జరిగిన బీజేపీ భేటీలో పేర్కొన్నారని సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీలను కూడా విదేశీయులు ప్రారంభించినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. దేశం పేరును వాడుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరని ప్రధాని ఆరోపించారన్నారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లు ప్రధాని పేర్కొన్నారు.