న్యూఢిల్లీ జూలై 25
మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మౌనం వీడకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్న విపక్షాలు.. లోక్‌సభలో కేంద్ర సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా పేరుతో కూటమిగా మారిన విపక్ష పార్టీలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మణిపూర్ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఇండియా కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు సిద్దమైంది. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. విపక్షాలకు చెందిన కొందరు ఎంపీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద గత రాత్రి నుంచి ధర్నా కొనసాగిస్తున్నారు. మూడవ రోజు పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలను వాళ్లు తప్పుపడుతున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై సెషన్ మొత్తం సస్పెన్షన్ విధించడంతో ఆయన అక్కడే ధర్నా చేస్తున్నారు. నిరసన చేపడుతున్న సంజయ్ సింగ్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది.