YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కృష్ణాలో జనసేనకు నాలుగు సీట్లు

కృష్ణాలో జనసేనకు నాలుగు సీట్లు

విజయవాడ, జూలై 26, 
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జనసేన క్యాడర్, లీడర్స్‌లో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఇక అదే ఊపులో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సీట్లపై కూడా కసరత్తు మొదలైందట. టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతున్నందున… దాన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు నియోజకవర్గాలను సెలక్ట్‌ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణాజిల్లా విషయంలో క్లారిటీ వచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం జనసేనకు ఎక్కడెక్కడ బలం ఉంది? ఏయే సీట్లలో పోటీ చేస్తే విజయం సాధిస్తామన్న లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఉమ్మడి కృష్ణాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో నాలుగు సీట్లలో గట్టిగా పోటీ చేయాలని అనుకుంటోందట జనసేన.2019 ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి బరిలో దిగిన జనసేన 8 సీట్లలో పోటీ చేసింది. జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ, అవనిగడ్డ, పెడన, మచిలీ పట్నం, కైకలూరులో నాడు పోటీ చేసింది గ్లాస్‌ పార్టీ. కానీ… నాలుగు చోట్ల మాత్రమే కాస్త ప్రభావం చూపగలిగింది. విజయవాడ పశ్చిమ, తూర్పు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లో 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఐదేళ్ళలో మారిన రాజకీయ పరిస్థితులను బట్టి జిల్లాలో 5 కంటే ఎక్కువ సీట్లు అడగాలని అనుకుంటున్నా.. సాధ్యం కాని పరిస్థితుల్లో గత ఎన్నికల్లో 15 శాతం ఓట్లు వచ్చిన ఆ నాలుగు సీట్ల కోసం గట్టిగా పట్టుబట్టాలని అనుకుంటున్నారట జిల్లా నాయకులు. అధినేత పవన్‌ మీద కూడా ఈ దిశగానే వత్తిడి తేవాలనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో బెజవాడ పశ్చిమలో 23 వేల ఓట్లు పడితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేనకు అదే స్థాయిలో ఓట్లు రావడాన్ని గుర్తు చేస్తున్నారు నాయకులు.ఇక పెడన, అవనిగడ్డలో కూడా 25వేల దాకా ఓట్లు వచ్చాయి. ఈ రెండు సీట్లలో ఖచ్చితంగా పోటీ చేద్దామని జనసేన అధినాయకత్వం పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేసిందట. చివరిగా విజయవాడ సెంట్రల్ సీటు స్థానం వంగవీటి రాధా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. రాధా జనసేనలో చేరే అవకాశం ఉందన్న అంచనాలున్నాయని, అదే జరిగితే…ఆయన ఖచ్చితంగా సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని, అప్పుడు ఆ సీటు కూడా తమ ఖాతాలో పడుతుందని లెక్కలేసుకుంటున్నారట జిల్లా నాయకులు. పొత్తులంటూ… అధికారికంగా ఖారయ్యాక ఈ లెక్కలన్నీ ఎలా మారతాయో చూడాలి.

Related Posts