విజయవాడ, జూలై 26,
కోడికత్తి కేసులో మళ్లీ లోతైన దర్యాప్తు చేయాలని సీఎం జగన్ వేసిన పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. సీఎం జగన్ వ్యక్తి గత మినహాయింపు పిటిషన్ పై ఆగస్టు 1న విచారించనుంది. కోడి కత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. కోడి కత్తి కేసులో కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరఫు న్యాయవాది విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నారని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైనా ఆగస్టు 1న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కోర్టులో రెగ్యులర్ విచారణకు హాజరుకావడం ఇబ్బంది మారిందని నిందితుడు తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయంపై ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి జైలు సూపరింటెండెంట్ వివరణ కోరారు. జైల్ లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, జైలు నుంచే విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. 2018 అక్టోబర్ లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్షనేత జగన్‌పై కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నం చేశాడు. అప్పుడు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిందికోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయాలని సీఎం జగన్ చేసిన అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా మళ్లీ లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ తీసుకురావడం సరికాదని, సాక్ష్యాల ప్రకారం శ్రీనివాసరావు ఒక్కడే నిందితుడని తేలిందని కుట్ర కోణం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని ఎన్ఐఏ తరఫున న్యాయవాది వాదించారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం కూడా లోతైన దర్యాప్తు పిటిషన్‌ను అనుమతించొద్దని కోర్టును కోరారు. ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే నిందితుడికి న్యాయం మరింత ఆలస్యం అవుతుందన్నారు.సీఎం జగన్, ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదులు ఇటీవల తమ వాదనలు పూర్తి చేశారు. దీంతో తీర్పును ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ఏ.సత్యానంద్ వాయిదా వేశారు. ఆ తీర్పును మంగళవారం ప్రకటించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ వ్యక్తిగత మినహాయింపు, శ్రీనివాస్ బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 1న విచారణ చేపట్టనున్నట్లు ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.