YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొత్తులపై కొనసాగుతున్న ప్రచారం

పొత్తులపై కొనసాగుతున్న ప్రచారం

విజయవాడ, జూలై 26, 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ హైదరాబాద్‌లో భేటీ అవుతారని రెండు పార్టీల శ్రేణుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేనాని వెళ్లి వచ్చాక వీళ్లిద్దరూ కలవడంపై అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. అసలు టీడీపీ, బీజేపీ, జనసేన కలవాలనే వ్యూహం పవన్, చంద్రబాబుదా.. లేక జగన్, ఢిల్లీ పెద్దల గేమ్‌ ప్లాన్‌లో భాగమా అనేది స్పష్టత రావడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్‌కు కేంద్ర పెద్దల సహకారం లేదనేట్లు వ్యవహరిస్తే చంద్రబాబు ఆలోచించే అవకాశముంటుంది. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ మీద వ్యతిరేకత వల్ల టీడీపీ నష్టపోయే అవకాశాలున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ఎత్తుగడ ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారాహి యాత్ర ప్రారంభం నుంచి జనసేనాని చేస్తోన్న వ్యాఖ్యలు జగన్ వర్సెస్ పవన్ అనేట్లున్నాయి. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్క్రిప్టునే పవన్ చదువుతున్నాడంటూ జగన్ వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇస్తున్నారు. కొన్నిసార్లు పవన్ రెచ్చిపోయి చేసే ప్రసంగాలు టీడీపీని ఇరుకున పెట్టేట్లున్నాయి. ఇది అధికార పార్టీకి మేలు చేసేట్లున్నాయని తమ్ముళ్లలో ఆందోళన రేకెత్తించింది. సీఎం జగన్‌తో పాటు పార్టీ యంత్రాంగం మొత్తం పవన్‌‌ను టార్గెట్ చేయడం వెనుక ఢిల్లీ పెద్దల గేమ్ ప్లాన్‌ అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు టీడీపీని కూడా ఎన్డీయేలో చేర్చుకునే అవకాశముందని, బీజేపీ – టీడీపీ మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లు సేనాని చెప్పుకొచ్చారు. ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశమున్నట్లు సేనాని అంటున్నారు.బీజేపీ అధినేతల ఎత్తుగడలు చూస్తుంటే టీడీపీని బలహీన పరిచేట్లున్నాయి. అందుకే పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కేంద్ర పెద్దలు వ్యవహరించ లేదు. అందుకే చంద్రబాబు తొందరపడకుండా సంయమనం పాటిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీకే గెలుపు అవకాశాలుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీకి ముస్లిం, మైనార్టీలు దూరమవడమే గాకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ వల్ల డ్యామేజీ జరగొచ్చు. ఈ కలయిక వల్ల సేనానికి, బీజేపీకి పోయేదేమీ లేదు. నష్టమంతా టీడీపీకేనని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.టీడీపీ ముందు కేవలం రెండే ఛాయిస్‌లు ఉన్నాయి. బీజేపీ లేకుండా పవన్‌తో పొత్తు పెట్టుకోవడం. రెండోది బీజేపీ, జనసేనను వదిలేసి వామపక్షాలను కలుపుకొని పోటీ చేయడం. ఈ రెండింటిలో ఏదైనా సరే అధికార పార్టీని సమర్థవంతంగా ఢీ కొట్టగలదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతకుమించి మరెలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీని విజయతీరాలకు చేర్చడం కష్టమంటున్నారు. ఇంతకీ చంద్రబాబు, పవన్ భేటీ అయితే ఓ స్పష్టత వస్తుందా.. లేక సస్పెన్స్ మరికొంత కాలం కొనసాగుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Related Posts