YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

29న నగరానికి అమిత్ షా

29న నగరానికి అమిత్ షా

హైదరాబాద్, జూలై 26, 
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. ఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో, జిల్లా కమిటీల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ సూచించింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కమిటీలు వేయాలని భావిస్తున్నారు. ప్రచార కమిటీ, మ్యానిఫేస్టో కమిటీ, సోషల్ మీడియా కమిటీ, ప్రచార సభల కమిటీ ఇలా 22 కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారు. పోటీ ఎక్కువగా లేని నియోజకవర్గాల్లో ఎన్నికల పనులు ప్రారంభించుకోవాలని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ నెల 29న ఖమ్మంలో అమిత్ షాతో భారీ బహిరంగసభకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా ఖమ్మం సభను వాయిదా వేశారు. అందుకు బదులుగా హైదరాబాద్ లో అమిత్ షా సామాజిక వర్గాల ప్రముఖులతో భేటీ కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఇటీవల బీజేపీ నేతలు తమ మధ్య ఉన్న లుకలుకలు బయటపెట్టుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పార్టీని లైన్లో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారని సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి అవసరమైన వనరులు ఏంటీ ? హైకమాండ్ నుంచి ఎలాంటి సహకారం అవసరం ? ఎంత వరకు పార్టీ అధిష్టానం సహాయం చేయగలదు ? ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలి ? ఇలాంటి అంశాలపై అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై అమిత్ షాతో చర్చించిన బండి సంజయ్ కు హైకమాండ్ నుంచి మంచి భరోసానే లభించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఏ మేరకు సర్ధుకుంటాయో చూడాలి.
బయిట పడుతున్న లుకలుకలు
గొడవలు, ఆధిపత్య పోరు, నేతల సూటిపోటి మాటలు, అసంతృప్తి ట్వీట్స్‌కు కేరాఫ్‌గా మారిపోతోంది తెలంగాణ బీజేపీ. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం సాక్షిగా … మరోసారి పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు ఇన్‌డైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా వేసిన పంచ్‌లు, చేసిన కామెంట్స్‌ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఇది చూసిన వారంతా…. అబ్బో… తెలంగాణ బీజేపీలో చాలా గొప్ప ఐకమత్యం ఉందే… సూపర్‌…. అంటున్నారట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అయితే ఈసారి మాత్రం గతానికి భిన్నంగా జరిగిందట కార్యక్రమం. ప్రమాణ స్వీకార సభ మొదట్నుంచి చివరిదాకా హాట్ హాట్‌గా జరిగింది. నేతలు గతంలోలాగా లోలోపల ఏం దాచుకోకుండా… తమ మనసులో ఉన్న మాటలు ఓపెన్‌గానే చెప్పేశారట. ఆ క్రమంలో కొందరు పార్టీ లైన్‌ దాటారన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిన విషయాలను కూడా బహిరంగంగానే మాట్లాడి కాక పెంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట.మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆకాశానికెత్తేశారు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. అదీ కూడా అలా ఇలా కాదు…భుజాల మీదెక్కించుకుని పైకెత్తి నెలబెట్టేశారంతే….. అంటున్నాయి పార్టీ వర్గాలు. బండి సంజయ్‌ని చూసి బాత్ రూంలోకి వెళ్లి ఏడ్చానని అన్నారు రాజగోపాల్‌రెడ్డి. అసలు సంజయ్ పదవి పోవడానికి రాజ్ గోపాల్ కూడా ఒక కారణమని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో అయన చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఇక ఈడీని కూడా కేసీఆర్‌ మేనేజ్ చేశారన్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరో మాజీ మంత్రి రవీంద్ర నాయక్ కూడా ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేతలకు వేదిక మీద మైకిచ్చి మాట్లాడమంటే…. అసలు విషయానికి బదులు ఏవేవో మాట్లాడేసి లేని పోని వివాదాలు కొని తెచ్చారన్న అభిప్రాయం ఉందట పార్టీ పెద్దల్లో. ఇక బండి సంజయ్‌ మాటలపై ఇంటా బయటా రచ్చ అవుతోంది. తన మీద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారని, అలాంటి పనులు మానుకోండని అన్నారాయన. దీంతో సంజయ్‌ ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలన్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. కనీసం కిషన్‌రెడ్డిని అయినా… స్వేచ్ఛగా పనిచేసుకోవ్వండని అన్న మాటలపై పార్టీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలి పరిణామాలను ఉద్దేశించే ఆయన అలా అనిఉంటారని గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కార్యక్రమానికి పిలవడంపై కూడా పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందట. పచ్చి సమైక్యవాది అయిన కిరణ్‌ను ఎలా పిలిచారంటూ కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. విజయ శాంతి అయితే ఏకంగా ట్వీట్ ఏ చేశారు. ఆయన వచ్చినందుకే నేను మధ్యలో వెళ్లిపోయానంటూ రాములమ్మ చేసిన ట్వీట్‌ కలకలం రేపుతోంది. ఈ పరిణాలన్నిటినీ చూస్తున్నవారు మాత్రం బీజేపీలో కూడా కాంగ్రెస్ కల్చర్ మొదలైందని అంటున్నారట. ఓ వైపు పార్టీ హై కమాండ్ సర్ది చెప్పే పని చేస్తుంటే… మరోవైపు ఎవరో ఒకరు గీత దాటి తల నొప్పి తెప్పిస్తున్నారన్నది ఇప్పుడు టీ బీజేపీలో ఉన్న అభిప్రాయం. ఈ లొల్లి ఇలానే కొనసాగితే ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎలాగన్న ఆందోళన కేడర్‌లో పెరుగుతోందట.

Related Posts