విజయవాడ, జూలై 28,
శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే ఇటు తిరుపతి వరకూ కూడా ప్రస్తుతం లోక్‌సభ సభ్యులుగా కొనసాగుతున్న చాలామంది వైసీపీ ఎంపీలు అసెంబ్లీవైపే మక్కువ చూపుతున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా ఉండేందుకు ఎంపీ పదవి కన్నా, ఎమ్మెల్యే పదవే బెటరని వారు భావిస్తున్నారు. తమ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లాలన్నా లోకల్ ఎమ్మెల్యే సహకారం తప్పనిసరి అవుతుందని వారి భావన. కొన్నిచోట్ల లోకల్ ఎమ్మెల్యేలతో పొసగడకపోవడంకూడా వారికి ఇబ్బందిగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఖర్చులు ఎక్కువుగానే ఉంటున్నాయి. వీటికి బదులు ఎమ్మెల్యేగా పోటీచేస్తే చాలన్న ధోరణిలో కొందరి వ్యవహారం ఉంది.శ్రీకాకుళం ఎంపీగా పోటిచేసిన వైసీపీకి చెందిన దువ్వాడ శీను ప్రస్తుం ఎమ్మెల్సీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ టెక్కటి అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. టిక్కెట్టుకూడా ఆయనకు ఇస్తున్నట్టు జగన్ కార్యకర్తల సమావేశంలోకూడా చెప్పారు. ఈ మధ్య శీను భార్యను ఇన్ఛార్జిగా నియమించారు. ఏదిఏమైనా ఆయన కుటుంబం ఎంపీ పదవికన్నా.. ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి చూపింది.ఇటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కూడా ఎమ్మెల్యేగా పోటీచేయడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీకూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తోంది. విశాఖ తూర్పునియోజకవర్గం నుంచి ఆయన పోటీచేయడానికి అన్నిరకాలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న అక్కరమాని విజయనిర్మలను ఒప్పించడం ఇప్పుడు పార్టీకి సవాలుగా మారిందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎంవీవీకి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తే ఎంపీ అభ్యర్థిని టీడీపీ వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబుకు బ్రేక్ చెప్పాలన్నది వైసీపీ వ్యూహం.రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌రాం కూడా ఎమ్మెల్యేవైపే మొగ్గుచూపారు. ఆయన్ను సిటీలో కూడా తిరగాలని కూడా అధినేత ఆదేశించారంట. ఇంతలోనే ఈ వ్యవహారం మళ్లీ మీమాంసలో పడినట్టు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. మొత్తమ్మీదకు ఎమ్మెల్యే పదవిపై మరో ఎంపీ మోజుపడినట్టే ఇక్కడ స్పష్టం అవుతోంది.బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌కూడా ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అందుబాటులో ఉన్న నియోజకవర్గాలపై సురేష్ కసరత్తు చేస్తున్నారు. ఇక నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయడం ఖరారయ్యింది. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్‌ఛార్జిగా నియమించారు. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కోటంరెడ్డి టీడీపీలో చేరారు.అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్య, అలాగే హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కూడా ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికే ఆసక్తి చూపుతున్నారని ఆయా జిల్లాల్లోని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు అధికారపార్టీలో కొంతమంది ఎంపీల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.