YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో గేమ్ షురూ

కర్ణాటకలో  గేమ్ షురూ

బెంగళూరు, జూలై 28, 
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా వందరోజులు  కూడా కాలేదు  ఇంతలోనే బీజేపీ  ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించింది. గతంలో  కర్ణాటక సహా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చి, గద్దె నెక్కిన కమల దళం, ఇప్పడు కర్ణాటకలో మళ్ళీ అదే కథను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. అవును ఇది ఎవరో, ఏ అనామక నాయకుడో చేసిన చిల్లర ఆరోపణ కాదు. బీజేపీని బద్నాం చేసేందుకు నాడు   రాజకీయ విశ్లేషకులు చేసిన రాజకీయ వ్యాఖ్యానం కాదు. స్వయంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని కూడా డీకే మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.ఒక్క డీకేనే కాదు. మరో మంత్రి కృష్ణ బైరెగౌడ కూడా మరింత స్పష్టంగా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.అదే సమయంలో,పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా ఇంచార్జి మంత్రులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాసినట్లు చెపుతున్న నకలీ  లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీకే ఆరోపణలకు బలం చేకూరిందని అంటున్నారు.  అదే సమయంలో  కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఆది నుంచి ఉన్న  విభేదాలు అడ్డు పెట్టుకుని, బీజేపీ కాంగ్రెస్ వేలితోనే కాంగ్రెస్  కంట్లో పొడిచే వ్యూహాలకు పదును పెడుతోందని అంటున్నారు.  నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం బీజేపీ అగ్ర నాయకత్వానికి తల వొంపులు తెచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని, సర్వం తానై విస్తృతంగా ప్రచారం చేసినా, అమిత్ షా నాయకత్వంలో కేంద్ర నాయకత్వం మొత్తానికి మొత్తంగా కర్ణాటకలో తిష్ట వేసి చక్రం తిప్పినా బీజేపీ ఓటమి పాలు కావడం కమల దళానికి మింగుడు పడలేదు. అందుకే, ఆలస్యం చేయకుండా అర్జెంటుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమైందనే అనుమానాలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వం  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ఐదు గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేయడంతో కమల దళంలో గుబులు మొదలైంది.  ఐదు గ్యారెంటీల విషయంలో సిద్దూ సర్కార్ సక్సెస్ అయితే  ఆ ప్రభావం మరో నాలుగైదు నెలలలో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పైనా ఉంటుందని అలాగే ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరగనున్నసార్వత్రిక ఎన్నికల పైనా ఉంటుందని భయపడుతోంది. అందుకే కమల దళం మొగ్గలోనే కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు తొందర పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ సిద్ధరామయ్య  కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికోసం విదేశంలో పథకం రచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమ ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని వెల్లడించారు.
అయితే, బీజేపీ పేరు  ఎత్తకుండా  ఈ కుట్ర చేసేది ఎవరో తమకు తెలుసునని డీకే పరోక్షంగా, కమలం పార్టీని వేలెత్తి చూపించారు. బెంగళూరులో ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తే తమ ప్రభుత్వానికి తెలుస్తుందని.. కుట్రకు సింగపూర్‌ ను వేదిక చేశారన్న డీకే.. దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని  పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలోనే డీకే శివకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుతం ఇలాంటి  కుట్రలకు భయడదని డీకే ధీమా వ్యక్తం చేశారు. ఒక  విధంగా చేతనైతే, సిద్దు సర్కార్ ను కూల్చాలని కమల దళానికి సవాలు విసిరారు.
అలాగే రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర బీజేపీకి ఉందని ఆరోపించారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. బీజేపీ కుట్రలను వమ్ము చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల చేత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అన్న ఆయన అందుకే, గతంలో లాగ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాకుండా ముందు నుంచే జాగ్రత్త అవసరమన్నారు.   
అయితే, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అంతర్గత సంక్షోభం ఏర్పడితే తప్ప సిద్దరామయ్య ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పులేదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Related Posts