YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తగ్గనున్న వానలు... ఆగమాగమైన 19 జిల్లాలు

తగ్గనున్న వానలు... ఆగమాగమైన 19 జిల్లాలు

హైదరాబాద్, జూలై 28,
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అల్ప పీడనంగా మారి బలహీన పడుతుందని, వానలు కూడా తగ్గుముఖం పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీన పడనుండటంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న ప్రకటించారు. కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప తెలంగాణలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని చెప్పారు. మరోవైపు తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉద్ధృతంగా ఉన్నాయి. తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద వర్షాలుగా నమోదయ్యాయి. హనుమకొండ సహా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల అసాధారణమైన భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్‌ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షం కురిసినట్లు వివరించారు. ఆగస్టు రెండో వారం, సెప్టెంబరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లో ఉత్తరాంధ్ర వద్ద కొనసాగుతోందని చెప్పారు. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 29, 30, 31 తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వివరించారు. తెలంగాణలో వర్షాలు, వరద పరిస్థితులు, సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్‌ అధికారులను నియమించారు. వరద సహాయ చర్యల కోసం 7997950008, 7997959782, 040-23450779 నంబర్లను ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దవానలు కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఏడాది పాటు కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే కురిసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో 27చోట్ల రోడ్లు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు.గోదావరి, కృష్ణా నదుల ఉగ్రరూపంతో ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. చరిత్రలో కనీవిని ఎరుగని వానతో తెలంగాణ తడిసిముద్దయ్యింది .4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.భారీ వర్షాలపై ప్రభుత్వ అప్రమత్తత భారీ ఎత్తున ప్రాణనష్టం జరగకుండా కాపాడింది. వరద పరిస్థితిపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా, వరద బాధితులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీఎం కేసీఆర్‌ వర్షాలు, వరదలపై అధికారులతో మాట్లాడుతూ, తగిన సూచనలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు.
గంటగంటకూ పరిస్థితిని సమీక్షించారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్‌ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాలని డీజీపీని ఆదేశించారు. సచివాలయంలో 'స్టేట్‌ లెవల్‌ ఫ్లడ్‌ మానిటరింగ్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేసి డీజీపీ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి పరిస్థితిపై పలు ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌చేసి ఆరా తీశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, కడెం, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.వరద అధికంగా ఉన్న ప్రాంతాల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లకు అవసరమైన నిధులు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చారు.కుంభవృష్టి వానలతో పోటెత్తిన వరద ప్రవాహంతో జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అనేక గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా 14 మంది గల్లంతయ్యారు. రెండు వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 5.5 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 135 చెరువులకు గండ్లు పడ్డాయని లెక్కించారు. హైదరాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సూర్యాపేట సహా పలు పట్టణాలు, నగరాల్లోని కాలనీలు, వివిధ జిల్లాల్లోని గ్రామాలు ముంపు నీటిలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related Posts