విజయవాడ, జూలై 29,
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 స్లోగన్ తో ముందుకెళ్తుంది. అసెంబ్లీ స్థానాలు అన్నింటిలో పాగా వెయ్యాలంటూ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి ఎంపీ సీట్ల పరిస్థితి ఏంటని అనుమానం వస్తుంది. రాజధాని అమరావతి ని ఆనుకుని ఉన్న కీలకమైన విజయవాడలో ఈసారైనా వైసీపీ గెలుస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలిచారు..గత ఎన్నికల్లో కేశినేని పై వైసీపీ నుంచి పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పీవీపీ బెజవాడవైపు గానీ వైసీపీ వైపు గానీ కన్నెత్తి కూడా చూడలేదు.సొంత పనులు, ఇతర వ్యవహారాలతో పీవీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్విట్టర్ పోస్టింగ్ ల్ ద్వారా తానొకడిని ఉన్నానని గుర్తు చేస్తుంటారు వరప్రసాద్.దీంతో బెజవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీకి సరైన నాయకుడు లేక అతీగతీ లేని పరిస్థితి ఏర్పడింది.2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు వరప్రసాద్.. అయితే పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం టీడీపీ గెలిచింది. మిగిలిన 6 చోట్ల వైసీపీ గెలిచింది. కానీ ఎంపీగా టీడీపీ నుంచి కేశినేని నాని గెలవడం అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిని చక్కబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు గెలిచేందుకు అధిష్టానం ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. విజయవాడ పార్లమెంట్ ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కానీ ఎంపీ అభ్యర్థి లేకపోవడం కొన్ని సందర్భాల్లో పార్టీకి సమస్యలు తెచ్చి పెడుతుంది. పీవీపీ స్థానంలో సరైన అభ్యర్థి దొరకడం లేదని…. అందులోనూ టీడీపీని ఎదుర్కొనే బలమైన నాయకుడి కోసం చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు వైసీపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు జరుగుతుండగా… కీలకమైన స్థానాన్ని ఖాళీగా ఉంచడం పట్ల కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇంతవరకూ విజయవాడ పార్లమెంట్‌కు అభ్యర్థి లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారనే చర్చ కొనసాగుతుంది. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని…సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తుండటం. వైసీపీ నాయకులపై పొగడ్తలు కురిపిస్తుండంతో ఆయన వైసీపీలో చేరుతారనే టాక్ మొదలైంది. కేశినేని నాని వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయం పై కేశినేని నాని అనుచరులు గానీ వైసీపీ నేతలు గానీ పెదవి విప్పడం లేదు. అటు చంద్రబాబు పై కేశినేని విమర్శలు చేస్తున్న ప్రతి సందర్భంలో పీవీపీ కౌంటర్ ఇవ్వడం చూస్తే.. మళ్లీ పీవీపీ కూడా సీన్‌లోకి వస్తారా అని కూడా చర్చ జరుగుతుంది. అయితే సీఎం జగన్ మాత్రం ఈ ఇద్దరూ కాకుండా మరో కొత్త వ్యక్తిని విజయవాడ బరిలో నిలబెట్టి విజయం సాధించేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అందుకే ఈ స్థానంలో ఇప్పటివరకూ ఇంఛార్జీని ప్రకటించలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థి ఎవరు అనేది పక్కన పెడితే కీలక స్థానంలో కనీసం ఇంచార్జి కూడా లేకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.