ఏలూరు, జూలై 29,
పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశలో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి మేరకు నిధులను విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదటి దశలో 41.5మీటర్లకు పరిమితం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చినట్లు పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమాధానాల ఆధారంగా స్పష్టమవుతోంది. పోలవరం ఎత్తును 41.5 మీటర్లుగానే పదేపదే కేంద్రం ఉటంకిస్తోంది.పోలవరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించే ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించిన తర్వాత, పనుల జరిగే తీరు ఆధారంగా నిధుల విడుదల ఉంటుందని జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభలో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.పోలవరంలో 41.15 అడుగుల మేర నీటి నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తి చేసేందుకు రూ.10,911 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వరదలతో దెబ్బతిన్న డయా ఫ్రం వాల్ మరమ్మతులు చేయడానికి మరో రూ.2 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.41.15 మీటర్ల మేర నీటి నిల్వకు అవసరమైన పనులు చేయడానికి సవరించిన అంచనాలు రూ.17,144.06 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 23న లేఖ రాసిందని కేంద్ర మంత్రి లోక్‌సభలో తెలిపారు. ఈ ప్రతిపాదనలో ప్రాజెక్టు మొదటి దశలో పాక్షికంగా ముంపునకు గురయ్యే 36 గ్రామాల పరిధిలోని 16,642 కుటుంబాలను పునరావాసంలో చేర్చారని వివరించారు.మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశలో ఉండగా పునరావాసం అంశం ప్రాజెక్టు రెండో దశలో ఉందని తుడు పార్లమెంటులో తెలిపిన సమాధానంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనను కేంద్రం ఆమోదించాల్సి ఉందని, ఆ తర్వాత కేంద్రం సూచించే విధి విధానాల ఆధారంగా నిధుల విడుదల ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు ఎత్తు తొలి దశలో 41.5 మీటర్లకు పరిమితం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. పరిహారం, పునరావాసం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.