- బీజేపీలో ఒక వర్గం నాయుకుల వాదన
- తటస్థ అభ్యర్థుల కోసం బీజేపీ చూపు
రాష్ట్రంలోని 13 లోక్‌సభ సీట్లలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని చెప్పడం ద్వారా పార్టీల మధ్య సరికొత్త పొత్తుల గురించి సంకేతాలు అందించింది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ సర్వే ఫలితాలను తేలిగ్గా కొట్టి పారేస్తున్నా, సర్వేలో చెప్పిన విషయాలను అంతర్గతంగా మాత్రం సీరియుస్‌గానే తీసుకున్నట్లు సమాచారం. బీజేపీ-వైఎస్‌ఆర్‌సీపీ మధ్య మైత్రీబంధం ఉందని, వీరి రహస్య స్నేహం ఎన్నికల నాటికి పొత్తుగా మారుతుందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ సర్వే తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ-బీజేపీ పొత్తుపై టీడీపీ సహా మూడు ప్రధాన పార్టీల నాయకులు స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు.ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న మానసిక సంసిద్ధతను ఏర్పర్చుకుంటున్నారు. ఈ నిర్దిష్ట అభిప్రాయానికి రావడానికి బలమైన కారణం ఉంది. రిపబ్లిక్ టీవీ జాతీయస్థాయిలో ఎవరి ‘వాయిస్’ను వినిపిస్తోందో, ఏ పార్టీ భావజాలానికి వాహికగా పనిచేస్తోందో అందరికీ తెలుసు. సీఎం చంద్రబాబుకు, ైవైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌కు, బీజేపీ ముఖ్యనేతలకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలిసిందే. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండచ్చో చెబుతూనే పార్టీల పొత్తులను రేఖామాత్రంగా వెల్లడించింది. బీజేపీ అధిష్ఠానం తాము చెప్పదలచుకున్న విషయాలను ఆ టీవీ రూపంలో చెప్పించి ఉంటుందన్న ప్రచారం సైతం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటిస్తే.. బీజేపీతో కలిసి నడిచే విషయంలో రెండో అభిప్రాయం లేదని జగన్ జాతీయ మీడియాకు మాత్రమే చెప్పడం కూడా.. రిపబ్లిక్ టీవీ నుంచి వచ్చిన సిగ్నళ్లను అందిపుచ్చుకోవడమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బిజెపిలో ‘విభజన’ గీత
ఏపీలో ప్రస్తుతం రెండు బీజేపీలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి.. చంద్రబాబుకు అనుకూలం కాగా, మరొకటి వ్యతిరేకం. వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు దాదాపు ఖాయమన్న అభిప్రాయం బలపడటంతో బీజేపీలోని ఈ రెండు వర్గాల మధ్య విబేధాలు కూడా భగ్గుమంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు.. ఇంకా చెప్పాలంటే ఇపుడు రాజ్యాంగ పదవిలో ఉన్న కీలక నాయకుడి అండదండలున్న వారంతా చంద్రబాబు వైపు ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు... వీళ్లు మాత్రం టీడీపీ అంటేనే మండిపడుతున్నారు. వీరు కాకుండా పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటివారికి సైతం టీడీపీ పొడగిట్టదు. బీజేఎల్పీ నాయుకుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు కూడా ఇపుడు టీడీపీ అంటే విరుచుకుపడుతున్నారు.
జాతీయ స్థాయిలో ప్రయోజనాలను ఆశించి వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం బీజేపీ అధిష్ఠానానికి ఉంటే.. వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యతిరేక బీజేపీ నేతల అభిప్రాయం. ఇన్నాళ్లూ టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన విష్ణుకుమార్‌రాజు... ఇప్పుడు ఒక అడుగు మందుకేసి వైఎస్‌ఆర్‌సీపీ వైపు మాట్లాడుతున్నారు. దీన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. మరోైవెపు సీఎం చంద్రబాబు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూనే సొంత పార్టీ నాయకులను అనునయిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం ైైఎ్‌ఆర్‌సీపీ తీరుపై బహిరంగంగానే మండిపడుతున్నారు.
ఒకవేళ వైఎస్‌ఆర్‌సీపీ-బీజేపీ పొత్తు ఖాయైమెతే.. ఆయన పార్టీ మారే అవకాశం కూడా లేకపోలేదు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం అధికార టీడీపీతో పొత్తు వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. పశ్చిమగోదావరి జల్లా తాడేపల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాణిక్యాలరావుతో, తూర్పుగోదావరి రాజకీయాలపై పట్టున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో టీడీపీ నేతలకు తగవులు జరుగుతూనే ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీకి గత ఎన్నికల్లో ఆదరణ లభించింది. కానీ... ఇది మోదీ హవా, బీజేపీకి మద్దతిచ్చిన పవన్ ప్రభావవేునని.. ఈ విషయాన్ని టీడీపీ మర్చిపోతోందని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈసారి వైఎస్‌ఆర్‌సీపీతో వెళ్లడం మంచిదని పార్టీ అధిష్టానంతో చెబుతున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల వేటలో బీజేపీ
పొత్తుల మాటెలా ఉన్నా రాష్ట్రంలో 40-50 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ భావిస్తోంది. పొత్తు ఎవరితో పెట్టుకున్నా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపటం బీజేపీకి సమస్యగా మారనుంది. సీట్ల బేరసారాల వద్ద కూడా పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయం కీలకంగా మారనుంది. 2014 ఎన్నికల్లోనూ బలమైన అభ్యర్థులు లేరనే సాకుతో ముందుగా బీజేపీకి కేటాయించిన సీట్లలో అక్కడక్కడ టీడీపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. సామాజిక సమీకరణల కన్నా ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొనగలిగే బలమైన అభ్యర్థులను ఎంపిక చేయటం, వారికి ఆయా నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించటం ముఖ్యం. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇదే విషయమై రాష్ట్ర నాయకులతో పదే పదే చర్చిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని, రాజకీయాలతో సంబంధంలేని తటస్థులను పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో కొందరు వైద్యులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు కూడా చెబుతున్నారు.