ముంబై, జూలై 29,
అక్టోబర్ - నవంబర్‌లలో భారత్ లోని పది నగరాల్లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో భారీ మార్పులు తప్పవా..? భద్రతా కారణాల రీత్యా అక్టోబర్ 15న జరగాల్సి ఉన్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు టోర్నీలోని చాలా మ్యాచ్‌ల షెడ్యూల్ సవరించడానికి బీసీసీఐ, ఐసీసీ చర్చలు జరుపుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా అదే రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమకు భద్రతా కారణాలు తలెత్తే అవకాశం ఉన్నదని గుజరాత్ సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను అక్టోబర్ 14న నిర్వహించాలని గుజరాత్ కోరుతోంది. ఇక తాజాగా పలు ఇతర దేశాలు కూడా తమ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని బీసీసీఐతో పాటు ఐసీసీని ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. పలు దేశాలు రెండు రోజుల గ్యాప్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా మరికొన్నిసార్లు ఏకంగా ఐదు నుంచి ఆరు రోజుల లాంగ్ గ్యాప్ ఉండటంపై వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై నిన్న ఢిల్లీలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించబోయే 12 స్టేట్ అసోసియేషన్స్‌తో సమావేశానికి హాజరైన బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. ‘కొంతమంది సభ్యులు తమకు రెండు మ్యాచ్‌ల మధ్య గ్యాప్ తక్కువగా ఉందని, మరికొందరు ఐదారు రోజులు గ్యాప్ ఉందని మాకు చెప్పారు. మేం దీనిపై చర్చిస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజులలో ఈ సమస్యను పరిష్కరిస్తాం..’ అని చెప్పాడు. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ను అక్టోబర్ 14న నిర్వహిస్తే పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది. అక్టోబర్ 12న ఆ జట్టు హైదరాబాద్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడి ఆ తర్వాత 14న అహ్మదాబాద్‌లో భారత్‌తో ఆడాల్సి ఉంటుంది. మధ్యలో ఒక్కరోజు గ్యాప్ మాత్రమే ఉంది. దీనిపై పాకిస్తాన్ కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోలేదు. అదీగాక అక్టోబర్ 14న ఇంగ్లాండ్ - అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. ఇదే రోజు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అది బ్రాడ్‌కాస్టర్ల మీద ప్రభావం చూపనుంది. ఈ సమస్యలపై త్వరలోనే ఐసీసీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇక స్టేట్ అసోసియేషన్స్‌తో జరిగిన మీటింగ్‌లో ప్రధానంగా వరల్డ్ కప్ నిర్వహించబోయే స్టేడియాలలో పునర్నిర్మాణ పనులు ఎక్కడిదాకా వచ్చాయి..? సౌకర్యాల వసతి ఎలా ఉంది..? టికెట్ రేట్లు, వాటిని అందజేయాల్సిన విధానాలపై చర్చించినట్టు తెలుస్తున్నది. టికెట్స్ అమ్మకాలపై ఇంకా నిర్ణయమేమీ తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 10 నుంచి క్రికెట్ టిక్కెట్లు
2023 ప్రపంచకప్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ విక్రయ ప్రక్రియ ప్రారంభించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టికెట్ ప్రైసింగ్ సంబంధించి సలహాలు ఇవ్వాలని ఆతిథ్యం ఇస్తున్న అన్ని అసోసియేషన్‌లకు సమాచారం ఇచ్చింది. ఆగస్టు 10 నాటికి ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈవెంట్ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులపై త్వరలోనే క్లారిటీ రానుంది. దీనిపై ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుల మధ్య చర్చ జరగనుంది. బీసీసీఐ కార్యదర్శి జే షా మాట్లాడుతూ.. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో షెడ్యూల్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మూడు పూర్తి సభ్య దేశాలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖలు రాసి షెడ్యూల్‌లో మార్పులు చేయాలని అభ్యర్థించినట్టు తెలిపారు. షెడ్యూల్ మార్పు చేయాలని మూడు సభ్య దేశాలు ICCకి లేఖ రాశారు. తేదీలు, టైం మాత్రమే మారతాయి, ఆడే గ్రౌండ్ మారదు, ఆటల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉంటే, దానిని 4-5 రోజులకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మూడు-నాలుగు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఐసిసితో సంప్రదింపులు జరిపి మార్పులు చేస్తామన్నారు షా.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ను కూడా రీషెడ్యూల్ చేస్తారా అని అడిగినప్పుడు, షా, "నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, కొన్ని బోర్డులు ICCకి లేఖలు రాశాయి. త్వరలో నిర్ణయం తీసుకుంటాం." అని సమాధానం చెప్పారు. హైప్రొఫైల్ మ్యాచ్‌కు ఎలాంటి భద్రతాపరమైన ఆందోళన లేదని షా అన్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు 10 నగరాల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లో ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆడనున్నాయి.