YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాపు కాసేదెవరు...

కాపు కాసేదెవరు...

కాకినాడ, ఆగస్టు 1,
కాపు సామాజికవర్గంలో ఆధిపత్య ధోరణి ఆ వర్గం కొంప ముంచుతోంది.తరతరాలుగా నాటుకుపోయింది ఈ ఆధిపత్య భావజాలాన్ని వదిలించుకోకపోతే బీసీల మద్దతు కూడగట్టే అవకాశాలు లేవు.కాపు సామాజికవర్గంలోని ఆధిపత్య ధోరణి కారణంగా తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగిలిన అన్ని కులాల ప్రజలకూ దూరమైంది.ఈ విధంగా ఇతర సామాజికవర్గాలన్నింటీనీ కాపులు శత్రువులుగా తయారు చేసుకున్నారు. కాపు నాయకుల ఆధ్వర్యంలో వచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విఫలమవడానికి ఇదే కారణమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.గోదావరి ప్రాంతంలో కాపులకు బీసీలు వ్యతిరేకం.కాపుల ఆధిపత్యాన్ని షెడ్యూల్డ్‌ కులాలు అంగీకరించరు. క్షత్రియులు కాపులకు దూరంగా ఉంటారని కలకత్తాలోని సామాజికశాస్త్రాల పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చెన్నూరి సతీష్‌ అంటున్నారు.ఆయన కాపుల రాజకీయ సమీకరణపై డాక్టరేట్‌ చేశారు. కాపుల రాజకీయ పోరాటాలు,సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక ఆరాటాలపై సతీశ్ సమగ్ర అధ్యయనం చేశారు.ఆయన అభిప్రాయాలతో మేధావులు,ఇతర కులాలకు చెందిన ఆలోచనాపరులు ఏకీభవించినా,ఏకీభవించకపోయినా ఆయన పరిశీలన ముమ్మాటికీ నిజం. Also Read - కాంగ్రెస్ పార్టీ లో స్నోబాల్ ఎఫెక్ట్ మొదలైందా? 1980లలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి ముందు పలువురు రాజకీయ నాయకులతో ఎన్ఠీఆర్ సంప్రదింపులు జరుగుతున్న కాలంలో 'కాపు,బలిజ,తెలగ,ఒంటరి కులాల సంఘం' పేరుతో కాపులను సమీకరించడానికి గోదావరి జిల్లాల్లో ప్రయత్నాలు జరిగాయని చరిత్ర చెబుతోంది.అప్పటికి కాంగ్రెస్‌ పార్టీ వెలుపల ఉన్న కాపులందరినీ కొత్త రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీలోకి పోకుండా నిరోధించడానికి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నించింది.'కాపునాడు' పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఆశీస్సులతో 'కాపు రాజకీయ సమీకరణ'కు ప్రయత్నాలు జరిగాయి.కాపులను రాజకీయంగా బలోపేతం చేయడానికి గాను ఆనాడు మంత్రి సంగీత వెంకటరెడ్డి వంటి వారు కృషి చేశారు.1978లో తూర్పు గోదావరి జిల్లాలో అప్పటి ఆలమూరు నుంచి వెంకటరెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాపు కులాలను, వెనుకబడిన తరగతుల్లో (బీసీలు) చేర్చాలని,తద్వారా వారికి బీసీ కోటా ఇవ్వాలనే నినాదం 'కాపునాడు' ఉద్యమంతో ముందుకు తీసుకొచ్చారు కానీ, 'కాపులకు రాజ్యాధికారం' ఇవ్వాలన్న డిమాండు చేయకపోవడం చారిత్రిక విషాదం.1983 జనవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో సంగిత వెంకటరెడ్డి ఆలమూరులో ఓడిపోయారు.జనతాపార్టీ,టీడీపీ,కాంగ్రెస్‌ పార్టీల తరఫున పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రి అయిన ముద్రగడ పద్మనాభం 'కాపులకు బీసీ హోదా' కోసం అనేకసార్లు ఉద్యమించారు.మెగాస్టార్‌ చిరంజీవి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడానికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా 2008లో కాపులకు బీసీ కోటా కావాలంటూ కాపు సామాజిక వర్గ మేధావులు అక్కడక్కడా సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి పార్టీ 'కాపు కులాలకు బీసీ రిజర్వేషన్లు' సాధించడం కోసమా? అనే చర్చ జరిగింది. బీసీలు, ఇతర కులాల్లోనూ ఇలాంటి అనుమానాలు కలిగాయి. కాపులకు అసలు కావలసింది బీసీ హోదాయా? రాజ్యాధికారమా? అనే విషయంపై కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర సామాజిక వర్గాల ప్రజల్లో అయోమయం ఏర్పడింది.చిరంజీవి పార్టీ స్థాపన కోసం రాజకీయ సమీకరణ కేవలం బీసీ హోదా కోసమే అనే రీతిలో కాపు నేతలు ప్రవర్తించారు. మొదట కాపు రిజర్వేషన్లకు,వారికి బీసీ హోదాకు వ్యతిరేకంగా బీసీ సంఘం నాయకుడు,ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆర్‌. కృష్ణయ్య మాట్లాడారు. నాటి కాంగ్రెస్‌ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో 'కాపులకు బీసీ హోదా' ఇవ్వడం పట్ల తనకు అభ్యంతరం లేదని కృష్ణయ్య అప్పట్లో ప్లేటు ఫిరాయించారు.  ముఖ్యమంత్రి పదవి ఇప్పటి వరకూ దక్కకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలలో రెడ్లు,కమ్మల కన్నా వార్తల్లో ఎక్కువగా ఎలా నిలవాలో కాపు జనసందోహాలు తెలుసుకున్నాయి. ఆ మేరకు రాజకీయంగా లబ్ధిపొందుతున్నాయన్న విమర్శలున్నవి. ప్రస్తుత ఏపీలో రెండు 'పాలకవర్గ కులాల'తో కులాలతో బేరమాడుతూ తమ డిమాండ్లు నెరవేర్చుకుంటున్నారు. కాకినాడ సిటీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శల వర్షం కురిపించగానే గారు ద్వారంపూడి కుటుంబానికి వత్తాసుగా కాపునాడు నాయకుడు ముద్రగడ మాట్లాడారు. ముద్రగడ వెనుక అధికారపార్టీ వైసీపీ ఉందన్నది బహిరంగ రహస్యం. ద్వారంపూడిపై పవన్ విమర్శలు చేసిన సన్నివేశానికి చాలా రోజుల ముందే వైసీపీతో ముద్రగడకు అనుబంధం ఏర్పడి ఉంది. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ ఎంపీ, ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు మిథున్ రెడ్డి చర్చలు ఫలించాయి. వచ్చే ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ నుంచి లేదా పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంటు నుంచి కానీ ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుటుంబసభ్యులు పోటీ చేసే అవకాశాలున్నవి. మిగిలిన అగ్రకులాల లాగే అన్ని పార్టీల్లోనూ కీలక స్థానాలను సాధించుకుంటూ తమ జాతి ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో కాపులు నేర్చుకున్నారని, లౌక్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నవి.పరిస్థితి ఇలాగే కొనసాగితే కాపులకు ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి కొన్ని ఎంపీ,కొన్ని ఎమ్మెల్యే సీట్లు దక్కవచ్చు. కొందరు మంత్రులు కావచ్చు. అంతకుమించి 'రాజ్యాధికారం' గురించి మాట్లాడడం, చర్చించడం, ఆకాంక్షించడం వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది.

Related Posts