YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాసులు కురిపిస్తున్న పచ్చ బంగారం

కాసులు కురిపిస్తున్న పచ్చ బంగారం

కడప, ఆగస్టు 2, 
పసుపు రైతుకు మంచి రోజులు వచ్చాయి. ధర రోజు రోజుకు పెరుగుతూపోతోంది. మూడేళ్లుగా సరైన రేటు లేక ఇబ్బందులు పడుతుండగా, ప్రస్తుత ధర ఊరటనిస్తున్నది. కొనుగోలు ప్రారంభంలో రూ.4600 ఉండగా, రెండు రోజులుగా బహిరంగ మార్కెట్‌లో క్వింటా ఫింగర్ పసుపు ధర రూ.10,025 పలుకుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2022-23 ఏడాదిలో పోరుమామిళ్ల, సిద్దవటం, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, జమ్మలమడుగు, దువ్వూరుతో పాటు పలు మండలాల పరిధిలో 4,122 మంది రైతులు 4783.500 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం పసుపుకు రూ.6,850 మద్దతు ధర పలికింది. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత నెల 2వ తేదీ నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో క్వింటా రూ.4 వేల నుంచి రూ.4,600లు ఉండేది. క్రమేణా పెరుగుతూ వచ్చింది. కొంత మంది రైతులు విక్రయించుకోగా, మరికొంత మంది ఇళ్లల్లో నిల్వ ఉంచుకున్నారు.ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు ఫింగర్ పసుపు ధర రూ.10,025 కాగా, బల్బ్ పసుపు (ఉంట కొమ్ము) రూ.10 వేలు పలుకుతున్నది. బహిరంగ మార్కెట్‌లో పసుపు తక్కువగా వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఈ నెల 12 నుంచి ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనిపై కొంతమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఇప్పటికే సరుకు అమ్ముకున్న వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి అన్నారు. దీనివల్ల ప్రయోజనం లేకుండా ఉందని చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా సరైన ధరలు లేవని, ప్రస్తుతం రేటు పెరుగుతుందని మార్కెట్ యార్డ్ సెక్రటరీ బాల వెంకటరెడ్డి పేర్కొన్నారు.పసుపు కు మంచి ధర లభిస్తుండడం సంతృప్తిగా వుంది. ఇదే ధరలు కొనుగోలు సమయం నుంచి వుండి వుంటే బాగుండేది. ఏది ఏమైనా పసుపు ధరలు పెరగడం రైతులకు కొంత ఊరటే.

Related Posts