YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ సీఎం అభ్యర్ధిగా పవన్

బీజేపీ సీఎం అభ్యర్ధిగా పవన్

విజయవాడ, ఆగస్టు 2, 
2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు మందుకు వేస్తున్న జనసేన , బీజేపీలు పొత్తుతో ముందుకు వెళ్లబోతున్నాయి. ఇటీవల ఎన్డీయే సమావేశానికి జనసేన హాజరు కావడం జనసైనికులకు ఆనందాన్ని కలిగించే ఆసక్తికరమైన పరిణామాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించే ప్లాన్ లో ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే బీజేపీ నుంచి ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే జనసేనతో పొత్తుకు టీడీపీకి శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్టేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ ను టీడీపీకి దూరం చేసి సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలనే లక్ష్యంతో బీజేపీ భిన్నమైన ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్, చంద్రబాబులకు ధీటుగా పవన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికేనన్న టాక్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశం అనంతరం పవన్ కోరుకుంటున్న రూట్ మ్యాప్ తో పాటు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పెద్దలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేనలు గెలుపుపై దిశా నిర్దేశం చేసిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించి, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే తప్ప, ఆ పార్టీలో తిరుగుబాటుకు దారితీసే అవకాశం ఉండదు. మరోవైపు 2024 ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేదు. ప్రధానంగా టీడీపీ వద్ద ఉన్న ఓటు బ్యాంకు క్రమేపీ బీజేపీ, జనసేనల వైపు మళ్లాలన్నదే బీజేపీ జాతీయ పెద్దల అభిలాషగా కనిపిస్తోంది. అందుకే ఇటీవల ఎన్డీఏ సమావేశానికి టీడీపీని పక్కన పెట్టి పవన్‌ని మాత్రమే ఆహ్వానించారని, దీని వెనక అతిపెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్‌ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
బీజేపీ ఇంచార్జిగా బండి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన కొత్త హోదాలో ఏమి చేయబోతున్నారనే దానిపై వాస్తవంగా ఎవరికి ఎలాంటి క్లూ లేదు. సంజయ్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో తెలంగాణలో ఆయన పాత్ర ఏమైనా ఉంటుందా అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని పొందిన ఏకైక వ్యక్తి సంజయ్ మాత్రమేనని, అందువల్ల పార్టీ మొత్తం దక్షిణాదికి లేదా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కూడా కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఆయన సేవలను వినియోగించుకోవచ్చని పార్టీలోని కొన్ని వర్గాలు తెలిపాయి.  జాతీయ కార్యవర్గం నుండి తొలగించబడిన సునీల్ దేవధర్ స్థానంలో సంజయ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తాజా పుకారు ఉంది. సంజయ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంచి పేరున్న వ్యక్తి, ఆ రాష్ట్రంలోని పార్టీ నాయకులు కూడా అతనిలాంటి ఫైర్‌ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీలో నిస్తేజంగా ఉన్న బీజేపీకి ఆయన కచ్చితంగా కొంత శక్తిని తెస్తారని పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో సంజయ్ ఏం చేస్తాడనేది ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి వ్యతిరేకంగా బలమైన వీధి పోరాటాన్ని ప్రారంభించిన ఆయన, ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జాతీయ నాయకత్వం గట్టిగా మద్దతు ఇస్తున్నందున ఆయనకు చేసేదేమీ ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. "సంజయ్‌ని తెలంగాణ నుండి తప్పించి, అతనికి పెద్దగా పని లేని రాష్ట్రానికి పంపించే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది" అని వర్గాలు అంటున్నాయి. అయితే సంజయ్‌ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

Related Posts