విజయవాడ, ఆగస్టు 2,
భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భాద్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్నయాలు తీసుకుంటున్నారు. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునుంచే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య రహస్య బంధం ఉందనే ఆరోపణలు తీవ్రంగా ఉండేవి. అలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ముందుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీ పర్యటనలతో క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసుకున్న బీజేపీ చీఫ్.. పార్టీ అనుబంధ విభాగాలతోనూ సమావేశమై కీలక సూచనలు చేసారు. ఇక ఆగస్ట్ నుంచి ప్రజాక్షేత్రంలో ఉద్యమాలకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగానే పార్టీలో కీలక మార్పులను చేస్తున్నారు పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగంలో అధ్యక్షులుతో నలుగురు జనరల్ సెక్రటరీలు, పదిమంది వైస్ ప్రెసిడెంట్లు, మరో పదిమంది సెక్రటరీలు, ఒక ట్రెజరర్ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కమిటీలో చాలామందిని మారుస్తూ కొత్త లిస్ట్ సిద్దం చేసుకున్నారు పురంధేశ్వరి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కొత్త జాబితాకు కేంద్రపెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.స్టేట్ కమిటీలో జనరల్ సెక్రటరీల స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఒకరిద్దరిని మార్పు చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త కూర్పు సిద్దం చేసారు. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ జాబితా సిద్దం చేసారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు వైస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. ఇక వీటితో పాటు మోర్చాల నేతలను కూడా మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. కొత్త జాబితాను ఇప్పటికే డిల్లీకి పంపిన పురంధేశ్వరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మార్పులు చేర్పులతో తన టీంను సిద్దం చేసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు పురంధేశ్వరి కసరత్తు చేస్తున్నారు.రాష్ట్రంలో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బరిలో దిగుతాయని పురంధేశ్వరి పదేపదే చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ప్రజా సమస్యలపైనా రెండు పార్టీలు కలిసి ఉద్యమాలు చేస్తామని కూడా చెప్పారు. ఇక తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గతంలో మాదిరిగా కాకుండా తరచుగా భేటీలు, సంప్రదింపులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతానని చెప్పిన పురంధేశ్వరి.. సమయం కోసం వేచిచూస్తున్నారట. పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం ఉంటుందని గతంలో చెప్పారు. అయితే ఢిల్లీ నేతలతో కలివిడిగా ఉన్న పవన్.. రాష్ట్రంలో మాత్రం కమలం నేతలను ఇంతవరకూ పెద్దగా కలిసిన దాఖలాలు లేవు. అయినా అధ్యక్షురాలు మార్పు తర్వాత ఇద్దరూ భేటీ అవుతారని ఇటీవల తెలిపారు. దీంతో వచ్చే వారం పదిరోజుల్లో ఇద్దరు నేతలు భేటీ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు పార్టీలు కలిసి అధికార పార్టీపై ఆందోళనలు చేయడం, ఉద్యమ కార్యాచరణ దిశగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.