YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పై చేయి... ఎవరిది...

పై చేయి... ఎవరిది...

విజయవాడ, సెప్టెంబర్ 26, 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి క్రమంగా పట్టు బిగించేస్తున్నట్లు కనిపిస్తోంది. నాలుగున్నరేళ్లలో జగన్‌ చేయలేకపోయిన పనుల్ని ఎన్నికలకు ముందు సునాయాసంగా చేయగలగడం చర్చనీయాంశంగా మారింది.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలు కెళ్లి రెండు వారాలు దాటిపోయింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా ఇప్పుడున్న పరిస్థితిని కనీసం కల్లో కూడా ఊహించి ఉండరు. ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా దానిని ముప్ప తిప్పలు పెట్టడంతో చంద్రబాబు అండ్ కో చాలా వరకు సక్సెస్ అయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా కోర్టు వివాదాలతో అడ్డుకోగలిగారు. రాజధాని వికేంద్రీకరణ మొదలుకుని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన, గ్రామ సచివాలయాల ఏర్పాటు, సంక్షేమ పథకాల అమలు ఏ అంశంలోనైనా చంద్రబాబు విజయవంతంగా చక్రం తిప్పగలిగారు. చంద్రబాబు మార్కు పోరాటాలతో జగన్ సర్కారు చాలా కాలం ఉక్కిరిబిక్కిరై పోయింది. ప్రభుత్వం ఏ విషయంలో ముందుకు వెళ్లాలనుకున్నా దానికి ఏదో రూపంలో అటంకాలు ఎదురు కావడానికి మూలాలను జగన్ గ్రహించడంతో రూటు మార్చేశారు.సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడుపై ఇన్నేళ్లలో ఒక్క కేసు కూడా లేదు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడంటూ దాఖలైన పిటిషన్లన్నీ ఏదొక దశలో కోర్టులు కొట్టేయడమో, స్టేలు మంజూరు కావడమో జరిగేది. దీంతో చంద్రబాబుకు క్లీన్ ఇమేజ్‌ ముద్రతో ముందుకు వెళ్లేవారు. అనూహ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కోలుకోలేని విధంగా టీడీపీ దెబ్బతీశాడు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకుండా చేశాడు. ఇదే దూకుడుతో జగన్ ఎన్నికలకు రెడీ అయితే ఆ ప్రభావం టీడీపీ మీద గణనీయంగానే ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. టీడీపీలో చంద్రబాబు తర్వాత నంబర్ టూ అంటూ ఎవరు లేరు. అటు వైసీపీలో కూడా అదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు చంద్రబాబు కష్టాల్లో ఉండటంతో టీడీపీ పరిస్థితిపైనే అందరి దృష్టి ఉంది.స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు నుంచి సులువుగా బయటపడిపోతామని టీడీపీ శిబిరం నిన్న మొన్నటి వరకు ఆశలు పెట్టుకుంది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ఖచ్చితంగా అమోదం లభిస్తుందని సంబరాలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు లాయర్లు వాదనలు వినిపించడంతో పాటు ఇతరత్రా కారణాలు కూడా బలంగా పనిచేస్తాయని ప్రచారం జరిగింది. హైకోర్టులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి బెంచ్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో టీడీపీకి గట్టి షాక్‌ తగిలినట్టైంది.ఇప్పుడు ఈ వివాదం సుప్రీం కోర్టు ముందుకు చేరింది.. ప్రతివాదులకు నోటీసులిచ్చి వారి సమాధానాలకు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా బాబుకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయనే భరోసా ఏది లేదు. ఒకవేళ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బాబుకు ఊరట లభించిన మరిన్ని కేసుల్లో చంద్రబాబును జైల్లోనే ఉంచాలని భావిస్తే చట్ట ప్రకారం చేయగలిగింది కూడా ఏమి ఉండదు. ఎన్నికలకు వరకు చంద్రబాబును జైల్లోనే ఉంచాలని ముఖ్యమైన వ్యక్తులు భావిస్తే అప్పుడు టీడీపీకి కష్టాలు తప్పకపోవచ్చు.చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా అవినీతి కేసుల్లో అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తండ్రి కొడుకులిద్దరిని జైలుకు పంపడం ఖాయమైతే అప్పుడు టీడీపీ పరిస్థితి ఖచ్చితంగా సంక్షోభంలో పడుతుంది. ఆ పార్టీని ముందుండి నడిపించడానికి తగిన నాయకులెవరు సిద్ధంగా లేరు. ఎన్నికల నాటికి కేసుల చిక్కుల నుంచి చంద్రబాబు బయటపడినా ప్రజల్లో తిరగడానికి, పార్టీని సిద్ధం చేయడానికి తగిన సమయం దొరక్క పోవచ్చు.అదే సమయంలో జనేసన వంటి మిత్ర పక్షాల డిమాండ్లను బలవంతంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురు కావొచ్చు. జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏముందని చెప్పుకోడానికి పార్టీ శ్రేణులకు చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం రాజకీయంగా బలాన్నిస్తుంది. అది ప్రత్యర్థులకు సానుభూతిగా మారుతుందా లేదా అనేది మాత్రం ఎన్నికల్లోనే తేలుతుంది. అయితే చంద్రబాబును కట్టడి చేసి జైలుకు పంపిన తృప్తి మాత్రం జగన్‌కు మిగిలిపోతుంది.

Related Posts