YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రిలాక్స్ మూడ్ లో టీడీపీ సీనియర్లు

రిలాక్స్ మూడ్ లో టీడీపీ సీనియర్లు

కాకినాడ, అక్టోబరు 21,
పొత్తు ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రకటన.. టీడీపీ నేతల్లో మాంచి ఊపు తెచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌తో డీలా పడిపోయిన పార్టీకి ఓ విధంగా పవన్‌ తన పొత్తు ప్రకటనతో బూస్టప్‌ ఇచ్చారనే చెప్పాలి. ఇదే సందర్భంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కొందరు నేతల్లో గుబులు పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడిగితే…. చంద్రబాబు కూడా కాదనలేక ఇచ్చేస్తే…. మా పరిస్థితేంటన్నది వారి ఆందోళన. తెలుగుదేశం నేతల్లో ఇదొక రకమైతే… ఇంకో కేటగిరీ వేరే ఉందట. జనసేనతో పొత్తు కుదిరిందనే క్లారిటీ రాగానే… వాళ్ళలో టెన్షన్‌ పటాపంచలైపోయి… ఫుల్‌ ఫ్రీ అయిపోయారట. ఇక పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అసలు ప్రచారానికి వెళ్లకున్నా… లేదంటే, జస్ట్‌ ఓసారి అలా రౌండ్‌ కొట్టేసి వచ్చినా చాలు అసెంబ్లీ మైక్‌ పట్టుకుని అధ్యక్షా అనొచ్చని ఊహల్లో తేలిపోతున్నారట.ఇంకా చెప్పాలంటే అసలు నామినేషన్‌ వేసి తడి గుడ్డేసుకుని కూర్చోవచ్చంటూ రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్ళిపోయారట. జనసేనతో పొత్తు కుదిరినా….మాకున్న సీనియారిటీ, టీడీపీ అధినాయకత్వం దగ్గరున్న పలుకుబడి దృష్ట్యా… సీటుకేం ఇబ్బంది ఉండదనే భావనతో ఉన్నారు కొందరు సీనియర్‌ నేతలు. అలా టిక్కెట్‌ వస్తుంది…. టీడీపీ, జనసేన బలంతో ఈజీగా గెలిచేస్తాం… ఇక కష్టపడటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకనుకుంటూ… చివరికి పార్టీ కార్యక్రమాలతో కూడా సంబంధం లేనట్టుగా…. హాయిగా కాలు మీద కాలేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారట. ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీఎం పర్యటన చేసినా…. అస్సలు పట్టించుకోలేదట సదరు నాయకులు. తమ జిల్లాకు సీఎం వచ్చారు.. ఆయనేం కామెంట్లు చేస్తారు..? దానికి మనమేం కౌంటర్‌ వేయాలన్న ధ్యాసే లేకుండా అదో మాదిరిగా వ్యవహరించారట ముందస్తు గెలుపు కలల్లో మునిగిపోయిన టీడీపీ సీనియర్‌ నాయకులు. ఈ వ్యవహారశైలి మిగిలిన నేతలతో పాటు పార్టీ ముఖ్యులకు మంటపుట్టిస్తోందట.వీళ్ళని చూసి అంతా ఇలాగే అనుకుంటే … పరిస్థితి ఏమైపోతుంది? పుట్టి మునగదా అని తలలు కొట్టుకుంటున్నారట. జనసేనతో పొత్తు కుదిరినంత మాత్రాన.. పార్టీ పరంగా మనం చేయాల్సిన కార్యక్రమాలను చేయకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే గెలిచేస్తామా అని మండిపడుతున్నారట ముఖ్య నేతలు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా? అలాంటప్పుడు ఈ వ్యవహార శైలితో బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఓవరాక్షన్‌ చేస్తే… ఓడించడానికి కూడా జనం వెనుకాడబోరన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుంటే మంచిదంటూ సదరు నేతలకు స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తున్నారట టీడీపీ మిగతా నేతలు. ఈ తరహాలో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్న నేతల వ్యవహార శైలిని కొందరు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్.. న్యాయపోరాటం వంటి వాటిల్లో అగ్రనేతలు బిజీగా ఉండడంతో… కొన్నాళ్లు ఆగండి తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని వాయిదా వేసినట్టు తెలిసింది. హడావిడి తగ్గి రొటీన్‌లో పడ్డాక ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ లీడర్లకు చాకిరేవు పెట్టే అవకాశం ఉందంటున్నారు.

Related Posts