ఏలూరు, అక్టోబరు 21,
జనసేన ఎన్నికలకు సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన తర్వాత పవన్ కొంత స్పీడ్ పెంచారు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించడమే కాకుండా కమిటీలో కొత్తవారికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తాము ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తామన్న దానిపై పవన్ కల్యాణ్‌కు ఒక స్పష్టత ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కడ ఇన్‌ఛార్జులను నియమిస్తూ పార్టీ బలోపేతానికి పనిచేయాలని నేతలను ఆదేశిస్తున్నట్లు తెలిసింది.చాలా రోజుల తర్వాత మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు. త్వరలోనే టీడీపీ, జనసేన పొత్తుల మధ్య చర్చ జరగనున్న నేపథ్యంలో సీట్ల పంపకంపై కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. సీట్లు తాము వదిలేసుకున్న నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముందుగానే పిలిచి పవన్ మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని హామీ ఇస్తున్నారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గం టీడీపీకే వదిలేస్తున్నట్లు అక్కడి నేతకు ముందుగానే చెప్పడం అంటే మూడు నెలల ముందే పవన్ పొత్తుపై ఒక స్పష్టత ఉన్నట్లు అర్థమవుతుంది.తాజాగా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకునట్లు స్పష్టమవుతుంది. అందుకే అక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను నియమించారు. పొత్తులో భాగంగా ఈ రెండు స్థానాలను జనసేన దక్కించుకునే అవకాశముంది. ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు ఈసారి జనసేన నుంచి ముప్పు పొంచి ఉన్నట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. ఈసారి ఇక్కడి నుంచి జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లుంది. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పత్సమట్ల ధర్మరాజును నియమించారుఇక అదే జిల్లాలోని మరో నియోజకవర్గంలోని ఉండి పైన కూడా జనసేన కన్నేసినట్లే కనపడుతుంది. ప్రస్తుతం ఉండిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మంతెన రామరాజు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండిలో జనసేనకు పట్టుంది. అందుకే ఈ నియోజకవర్గాన్ని కూడా తాము పొత్తులో భాగంగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇక్కడ ఇన్‌ఛార్జిగా జుత్తిగ నాగరాజును పవన్ నియమించారు. జనసేన ఎక్కువగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే పోటీకి ఉత్సాహం చూపుతుంది. అందుకే ముందుగానే ఇన్‌ఛార్జులను నియమిస్తూ పవన్ ఒకింత స్పీడ్ పెంచారంటున్నారు జనసేన పార్టీ నేతలు. మరో వైపు సిట్టింగ్‌లందరికీ టీడీపీ టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి పొత్తులో ఈ సీట్లను జనసేన ఎలా దక్కించుకుంటుందన్నది చూడాల్సి ఉంది.