YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

దండిగా ధాన్యం దిగుబడి!

దండిగా ధాన్యం దిగుబడి!

మెదక్ జిల్లాలో యాసంగి సీజన్‌లో వరిసాగు చేసిన రైతులకు అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అందింది. దీంతో వరి రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభుత్వం తరపున కొనుగోళ్లు ఆశాజనకంగా సాగడంతో ఈ ఏడాది ఆర్ధిక సమస్యల నుంచి కొంత గట్టెక్కే అవకాశం ఉందని కర్షకులు భావిస్తున్నారు. మెదక్ వ్యవసాయరంగ ప్రాధాన్యం కలిగిన జిల్లా. రాష్ట్రంలో కొన్నేళ్లుగా సమయానుకూలంగా వర్షాలు కురవలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని ప్రభావితంచేశాయి. ఇక చీడపీడలు, ప్రతికూల వాతావరణాల వల్ల రైతులు ఎంత కష్టపడ్డా అంతంతమాత్రం దిగుబడులే దక్కించుకునేవారు. ఇక చేతికొచ్చిన పంటను అమ్ముకోవడంతో నానాపాట్లు పడుతూ ఆర్ధికంగా నష్టపోయేవారు. అయితే ఈ యాసంగిలో పరిస్థితి గతానికి భిన్నంగా  ఉంది. అన్నదాతలు ఆశించిన, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 1.34 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే అది 1.71 లక్షల టన్నులకు చేరింది. ధాన్యానికి తగ్గట్లుగానే పౌరసరఫరాల శాఖ అధికారులు సేకరణ లక్ష్యాన్ని కూడా పెంచారు. 2017-18 యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో అన్ని వనరుల కింద కలిపి మొత్తం 73,775 ఎకరాల్లో వరిపంట సాగైంది. ప్రభుత్వం స్థానిక నీటి ప్రాజెక్టుల నుంచి వ్యవసాయక్షేత్రాలకు సాగునీరు అందించడంతో పలు ప్రాంతాల్లో అధికంగా వరి సాగు చేశారు. సింగూరు ప్రాజెక్ట్‌ నుంచి విడతలవారీగా 13 సార్లు నీటిని విడుదల చేయడంతో సకాలంలో తడులు అంది ఆయకట్టులో పంట బాగా పండింది. సాధారణంగా ఎకరాకు 25-30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ఈసారి సకాలంలో నీటి తడులు అందడం, ఎలాంటి తెగుళ్లు ఆశించకపోవడంతో క్వింటాలుకు 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. 

 

భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల బోర్ల కింద సాగుచేసిన వరి పంట కొంతమేర ఎండిపోయి, కొందరు రైతులకు ఆశించిన దిగుబడి రాక నష్టపోగా, ప్రాజెక్ట్‌, నదీ పరివాహక ప్రాంతం, నీటి లభ్యత ఉన్న చెరువుల కింద సాగుచేసిన పంట దిగుబడి బాగుంది. ఆశించినదానికన్నా అధిక దిగుబడి లభించింది. ధాన్యం దిగుబడి అధికంగా ఉండడంతోనే జిల్లావ్యాప్తంగా ఆయా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. సహకార సంఘాలు(సొసైటీ), మహిళా సంఘాల(ఐకేపీ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 179 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగం అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా.. సాధారణ స్థాయికి మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలన్నీ ధాన్యంతో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసిన ధాన్య రాశులే కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ధాన్యం దిగుబడి అంచనాలను మించడంతో కొనుగోలు కేంద్రాల సంఖ్యను 185కు పెంచారు. అయినప్పటికి కేంద్రాల్లో గోనె సంచుల కొరత తలెత్తింది. దీంతో పౌరసరఫరాల కమిషనర్‌ అదనంగా 7 లక్షల గోనె సంచులు తెప్పించారు. ఇప్పటివరకు 1.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా చోట్ల ధాన్యం నిల్వలు బాగా పేరుకుపోయాయి. దీంతో జూన్ మొదటి వారం వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తంగా ధాన్యం దిగుబడి పెరగడంతో అన్నదాతల మొహాల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఆర్ధిక సమస్యలను అధిగమించగలమని వరి రైతులు భావిస్తున్నారు. 

Related Posts