YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొందరికేనా గృహాలు!

 కొందరికేనా గృహాలు!

పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరు గారుతోందన్న విమర్శలు విజయనగరంలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని స్పష్టంచేస్తున్నా క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కడం లేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.80లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు వివిధ పథకాల పేరిట సుమారుగా 40వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని గుర్తుచేస్తున్నారు. వీటిలో ఇప్పటికీ సుమారుగా 7వేల వరకు గ్రౌండింగ్‌ కాలేదని, నిర్మాణాల్లో ఉన్నవి కూడా బిల్లులు రాక మధ్యలో నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన కనిపించడం లేదని నిరాశ చెందుతున్నవారూ ఉన్నారు. జిల్లాలోలక్షలాది మంది పేదలు ఇళ్లు మంజూరు కోసం ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 2016-17లో ఎన్‌టిఆర్‌ గృహనిర్మాణ పథకానికి సంబంధించి 10,900 ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో నేటికీ 33 ఇళ్లు గ్రౌండింగ్‌ కాలేదు. అలాగే 2017-18కు సంబంధించి 10,395 ఇళ్లు మంజూరు కాగా, అందులో 1,883 ఇళ్లు గ్రౌండింగ్‌ కాలేదని సమాచారం. 2018-19కు సంబంధించి 10,050 ఇళ్లు మంజురు చేసినట్లు ప్రకటించారు. అయిటే వీటిలో 3,717 ఇళ్లు ప్రారంభించనేలేదని స్థానికులు చెప్తున్నారు. ఎన్‌టిఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ పేరుతో 7వేల ఇళ్లు మంజూరు చేసినప్పటికీ వాటిలోనూ నిర్మాణాలు  అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. మరోవైపు నిర్మాణం జరుగుతున్న వాటికి కూడా సకాలంలో బిల్లులు రాక ఎన్‌టిఆర్‌ గృహనిర్మాణం ముందుకు సాగడం లేదన్న కామెంట్స్ జిల్లాలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా జన్మభూమి, గ్రీవెన్సుల ద్వారా సుమారుగా 1.80లక్షల మంది గృహనిర్మాణ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది కొందరికే అని లబ్ధిదారులు వాపోతున్నారు. అనేకమంది పేదల దరఖాస్తులు మంజూరుకు నోచుకోలేదని చెప్తున్నారు. జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు సిఫార్సుల ద్వారా అయితేనే దరఖాస్తులు తీసుకుంటామని గృహనిర్మాణశాఖ అధికారులు  పేదలకు చెప్తున్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ విషయమై ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలందరికీ గృహాలు మంజూరు చేయాలని, సకాలంలో బిల్లులు చెల్లించాలని అంతా కోరుతున్నారు.  

Related Posts