YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసంతృప్తులు... సేఫ్ సైడ్...

అసంతృప్తులు... సేఫ్ సైడ్...

నెల్లూరు, అక్టోబరు 31,
టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తామంటున్నాయి. మరోవైపు జనసేన ఎన్డీయేలో భాగస్వామిగా బీజేపీతో పొత్తులో ఉంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందో లేదో తెలీదు. ఇంకోవైపు అధికార వైసీపీలో సీట్లు దక్కవనుకున్న వాళ్లు, అసంతృప్తి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. మొత్తంగా ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారు? మరెవరు నిష్క్రమిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందనేది ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో తేలిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు కాంగ్రెస్, బీజేపీ నుంచి సెగ తగిలేట్లుందని భావిస్తున్నారు. టీడీపీ తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండడం, దృష్టి అంతా ఏపీ మీద కేంద్రీకరించడం వల్ల పోటీ చేసినా ప్రయోజనం ఉండదని భావించినట్లుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని సెటిలర్లు మొత్తం కాంగ్రెస్కు జై కొట్టే అవకాశముంది. మారిన రాజకీయ పరిణామాలతో ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు ఊపిరాడడం లేదు. జాతీయ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే సానుకూలత ఉన్నట్లు వెల్లడించాయి. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోతే ఆ ఓటింగ్ లో ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా కొనసాగితే ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలను చంద్రబాబు అట్టిపెట్టుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో భారీగా కుదుపులుంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంపై దృష్టి సారిస్తే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సీట్లు దక్కని వాళ్లకు టీడీపీ, జనసేనలో అవకాశం లేదు. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ఎవరి సీటుకు గండిపడుతుందోనన్న ఆందోళన నెలకొంది. అలాగే అసంతృప్తితో ఉన్న వైసీపీ సీనియర్ నేతలకు సైతం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తోంది. మొత్తంగా డిసెంబరు 3 (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే తేదీ) తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవచ్చని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోందిరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఈపాటికే ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు జవసత్వాలు కల్పించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర విభజన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామంటున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేనల్లోని అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ వేదికగా మారే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చినా ఇక్కడ ప్రధాన పక్షాల్లో కలవరం తప్పదు. అందుకే మూడు పార్టీల్లో నేతలు తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts