YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనసాగుతున్న నగదు కొరత ఇక్కట్లు

 కొనసాగుతున్న నగదు కొరత ఇక్కట్లు

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి సుమారు ఏడాదిన్నర గడుస్తోంది. అప్పట్లో తలెత్తిన నగదు కొరత జనాలపై తీవ్ర ప్రభావం చూపింది. అత్యవసర పనులకు సైతం డబ్బులు అందక ప్రజలు నానాపాట్లు పడ్డారు. అప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ తరహా సమస్యలే ఉంటున్నాయన్న వార్తలు తరచూ పతాకశీర్షికలవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ తాజాగా ఇదే సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికీ ప్రజలకు నగదు పాట్లు తప్పడం లేదన్న వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎటిఎంలు అన్ని వేళల్లోనూ మూతపడే ఉంటుండడంతో స్థానికులకు నోట్లు కష్టాలు తప్పడంలేదు. కోటబొమ్మాళి మండల కేంద్రంలో స్టేట్‌బ్యాంకుకు సంబంధించిన ఎటిఎంలు రెండు, నెంబర్‌ వన్‌కు సంబంధించినవి రెండు, ఆంధ్రా బ్యాంకు ఎటిఎం ఒకటి, ఇండియన్‌ బ్యాంకు ఎటిఎం ఒకటి ఉన్నాయి. అయినప్పటికీ దేనిలోనూ నగదు లేదని అంతా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎటిఎంలు మూసే ఉంటున్నాయని చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న తమ సొమ్ము తీసుకోనేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైపు వివాహాది శుభకార్యాలు, మరోవైపు గృహనిర్మాణ పనులు, ముఖ్యంగా డ్వాక్రా సభ్యులు, ఉపాధి కూలీలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ అవసరమైన నగదు లేక పోవడంతో బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రాజుకుంటోంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రజలకు నోట్లు పాట్లు నుంచి విముక్తి కలిగించాలని పలువురు వినియోగదారులు విజ్ఞప్తిచేస్తున్నారు.

నల్లధనం వెలికితీత, అరికట్టడంలో భాగంగానే పెద్దనోట్లు రద్దు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 2016నవంబర్‌లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద-ధనిక తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేసింది. అనేక నెలల పాటూ దేశంలో నగదు కొరత కొనసాగింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనాలు బారులు తీరి ఉండేవారు. కొంతకాలం తర్వాత ఆ దుస్థితి తప్పినా ఇటీవలిగా మరోసారి నోట్ల కొరత తలెత్తింది. ఏటీఎంలు మూతపడి ఉంటున్న పరిస్థితి. బ్యాంకులకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో వినియోగదారుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇక రైతుల పరిస్థితి అయితే మరీదారుణంగా ఉంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నా తీసుకోలేని పరిస్థితి వారిది. అసలే ఖరీఫ్ సాగుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. దీంతో రైతులకు అనేక పనులు ఉంటాయి. చేతిలో డబ్బు ఉంటేనే గానీ ఏ పనీ జరగదు. ఇలాంటి సమయంలో నగదు కొరత నెలకొనడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో నగదు కొరత తీర్చేందుకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే సాగు పరంగా తాము పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

Related Posts