ప్రముఖ బెంగాలీ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుప్రియా దేవి (85) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆమె శుక్రవారం కోల్‌కతాలోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 'చౌరంగీ', 'భగ్ బందీ ఖేలా', 'మేఘే దాక తార' వంటి క్లాసిక్ బెంగాలీ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.ఉత్తమ్ కుమార్ నటించిన 'బసు పరివార్' (1952) చిత్రం ద్వారా నటిగా తొలి అడుగులు వేసిన సుప్రియా.. అదే ఉత్తమ్ కుమార్‌తో కలిసి నటించిన 'సోనర్ హరిణ్' (1959) తరువాత ఇక వెనుకకి తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఐదు దశాబ్దాల పాటు నటిగా బెంగాలీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. సుప్రియా దేవి మృతి పట్ల బెంగాలీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆమె లేని లోటు తీర్చలేదని వారు చెప్పుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్‌లో తన సంతాపాన్ని తెలుపుతూ.. ''లెజండరీ యాక్ట్రస్ సుప్రియా చౌదరి (దెబి) మరణ వార్త విని ఎంతో బాధపడుతున్నాను. ఆమె తన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె కుటుంబానికి, అభిమానులకు నా సంతాపాన్నితెలియజేస్తున్నాను'' అని పేర్కొన్నారు.