విశాఖపట్టణం, నవంబర్ 1,
కోడి కత్తి కేసులో న్యాయవిచారణలో జాప్యం కారణంగా ఎందరో ఏ నేరం చేయని వారు సైతం రిమాండ్ లో జైళ్ళలో మగ్గుతున్నారు. విలువైన జీవితాలను కోల్పోతున్నారు.ఈ రోజున దేశంలోని న్యాయస్థానాల్లో లక్షలు కాదు కోట్లలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి ఎంత మంది నిర్దోషులు నిదితులుగా విచారణ ఎదుర్కుంటున్నారో రోజులు, నెలలు, సంవత్సరాలుగా, జైళ్లలో మగ్గుతున్నారో లెక్కలేదు. ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని అన్నారు. చట్టంలో సంక్లిష్టతలను తొలిగించి, అందరికీ అర్థమయ్యే విధంగా, చట్టాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడంతో పాటుగా, సులభతర న్యాయం ఈజ్ ఆఫ్ జస్టిస్ లక్ష్యంగా చట్టాలను సవరించ వలసిన అవసరం ఉందని మోడీ అన్నారు. అలాగే,భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అనేక సందర్భాలలో పెండింగ్ కేసుల విషయంలో విచారం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో 1970ల నాటి కేసులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, జుడిషియల్ క్లాక్ పదేళ్ళు ముందుకు పరుగులు తీయాలని అన్నారు. అయితే, వాస్తవంలో ఏం జరుగుతోందో జుడిషియల్ క్లాక్ ఎంత వేగంగా కదులుతుందో, చూస్తూనే ఉన్నాం. అది కూడా ఎక్కడో కాదు. మన ఆంధ్ర ప్రదేశ్ లోనే చూస్తున్నాం. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు కీలక నేరాలు తెరపై కొచ్చాయి. అందులో ఇకటి అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ‘కోడికత్తి’ దాడి కేసు రెండోది అదే జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. ఈ రెండు కేసులు కూడా రాజకీయాలతో ముడి పడినవే. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినవే. అయినా ఈ కేసుల్లో ఇంతవరకు దోషులెవరో తేలలేదు. నిజానికి, బాబాయ్ మర్డర్ కేసుతో పోలిస్తే, కోడి కత్తి కేసు చాలా చాలా చిన్న కేసు. అయినా, బాబాబ్ మర్డర్ కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, అదే కేసులో ఏడవ నిందితుడు,అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం హెల్త్ గ్రౌండ్ పై బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలయ్యారు. వివేకా హత్య కేసుతో పోలిస్తే, కోడికత్తి కేసు చాలా చిన్న కేసు. కాదు కాదు వివేకా హత్య కేసుతో పోలిస్తు కోడికత్తి కేసు అసలు కేసే కాదు. అయినా ఐదేళ్ళ క్రితం వైజాగ్ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కు మాత్రం ఇంతవరకు బెయిల్ రాలేదు. దీంతో దాదాపు ఐదేళ్లుగా బెయిల్ లేకుండా అతను జైల్లోనే మగ్గిపోతున్నారు. ఇదెక్కడి న్యాయం? కానీ న్యాయశాస్త్ర మూల సూత్రం, (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డెనీడ్)కు మాత్రం ఈ జాప్యం పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఇంకో దుర్మార్గం, మహా దుర్మార్గం ఇంకొకటుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే సరిపోతుందని, కానీ జగన్ రెడ్డి ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదని అతని కుటుంబం, లాయర్ ఆరోపిస్తున్నారు.అవును ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు, కానీ, ఎక్కడో ఇంగ్లాండ్ లో చదువుకుంటున్న తమ బిడ్డలను చూసోచ్చేందుకు.. అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొని వారితో ఆనందం పంచుకునేందుకు సమయం చిక్కిన ముఖ్యమంత్రికి, పక్కనే ఉన్న జగన్ రెడ్డి ఇష్ట నగరం వైజాగ్ వెళ్లి, కోర్టులో వాగ్ములం ఇచ్చే సమయం లేదా అన్నది శ్రీను తల్లి తండ్రులే కాదు , సామాన్యులు కుడా అడుగుతున్న ప్రశ్న.