YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఓ వైపు కోర్టులు... మరో వైపు ప్రయత్నాలు... తరలింపు సాధ్యమా

ఓ వైపు కోర్టులు... మరో వైపు ప్రయత్నాలు... తరలింపు సాధ్యమా

విజయవాడ, నవంబర్ 2,
ఈ సంక్రాంతి.. ఈ దసరాకి.. మరో రెండు నెలలలో.. మరి కొద్ది రోజులలోనే.. అతి త్వరలోనే.. ఇవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండి పాలన కోసం పెట్టిన గడువులు, ముహూర్తాలు, చెప్పిన మాటలు. గత రెండేళ్లుగా విశాఖ రాజాధాని అనే మాట వల్లె వేసిన వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో విశాఖ నుండి పాలన అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. అధికారికంగా విశాఖకు రాజధాని తరలింపు కుదిరే అంశం కాకపోవడంతో సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు అంటూ హడావుడి మొదలు పెట్టారు. మాటలైతే ఎప్పటికప్పుడు కోటలు దాటుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ కాదు.. రిషికొండ ప్యాలెస్ నుంచి జగన్ పాలన అంటూ ప్రసంగాలూ, ప్రకటనలూ దంచేస్తున్నారు. కానీ అందుకు ముహూర్తాలు మారుతున్నాయి. గడువులు మారుతున్నాయి  ఆచరణ మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. రిషికొండను తవ్వేసి అక్కడ భారీ నిర్మాణాలు కట్టేస్తున్న సంగతి తెలిసిందే. పేరుకు ఇవ్వన్నీ పర్యాటక శాఖ భవనాలని చెప్పినా.. అవి సీఎం కార్యాలయాల కోసమేనని అందరికీ తెలిసిందే.  వైసీపీ నేతలే ఓపెన్ గా ఈ మాట చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గడువులు మారిన విశాఖ పరిపాలన తరలింపు తాజాగా దసరా నుండి ఈ డిసెంబర్ కి మారిన సంగతి తెలిసిందే. అయితే  ఇప్పుడు ఈ డిసెంబర్ లో సీఎం విశాఖకు మకాం మార్చడం కష్టమే అన్న భావనే అందరిలో వ్యక్తం అవుతోంది.  విశాఖకు తరలి వెళ్లాలంటూ ప్రభుత్వం అక్కడ పరిపాలనకు అనువైన భవనాలు చూడాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే విశాఖలో పర్యటించి నివాస యోగ్యమైన భవనాలను ఎంపిక చేసింది. ఆ మాటకొస్తే కమిటీ ఏర్పాటుకు ముందే వైసీపీ నేతలు ఇక్కడ భవనాలను వెతికి పెట్టారు. ఇక రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలలో కొన్నింటిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే, రుషికొండ మీద భవనాలంటే తొలి నుండి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే రుషికొండపై భవనాలపై పిటిషనర్లు కోర్టుకు వెళ్లారు. రుషికొండ మీద కోర్టు అనుమతికి విరుద్ధంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని గతంలో కోర్టుకు వెళ్ళిన పిటిషనర్లే ఇప్పుడు మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. గతంలో రుషికొండపై 9.88 ఎకరాలలో తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతిస్తే.. ఏకంగా 20 ఎకరాలలో తవ్వకాలు చేపట్టారు. ఇదే విషయాన్ని అప్పుడు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో కేంద్ర బృందం పరిశీలించి అక్రమ తవ్వకాలు నిజమేనని నివేదికను హైకోర్టుకు అందజేసింది.మరి ఆ నివేదిక ఏమైందో తెలియదు.. చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలియదు. కాగా, ఇప్పుడు మరోసారి అదే పిటిషనర్లు రుషికొండ మీద అక్రమ కట్టడాలు అంటూ హైకోర్టుకు వెళ్లగా.. కేంద్ర బృందాలతో మరోసారి సర్వే చేయించాలని కోర్టు ఆదేశించింది. అలాగే గతంలో ఇచ్చిన అక్రమ తవ్వకాల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మొత్తంగా త్వరలోనే బృందాలు మళ్ళీ విశాఖకు వచ్చి ఈ నిర్మాణాలను పరిశీలించనున్నాయి. అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని ఇప్పటికే కేంద్ర బృందాలు నివేదిక ఇవ్వగా..  ఇప్పుడు పరిశీలినకు రానున్న బృందాలు కూడా అనుమతికి మించి నిర్మాణాలు కూడా జరిపారని నివేదిక ఇవ్వడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ పర్యాటక భవనాలకు సరిపడా నిర్మాణాలు కట్టాల్సిన చోట.. సీఎంఓ కోసం సుమారు రూ.500 కోట్లతో భారీ ప్యాలెస్  నిర్మాణం జరుగుతోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కనుక కేంద్ర బృందం రేపు ఎలాగూ నివేదికలో కోర్టుకు అదే చెప్పనుంది. దీంతో కోర్టు ఆదేశాలు కీలకం కానున్నాయి.రుషికొండపై భవనాలు నిబంధనలుకు విరుద్దమైతే అది సీఎంఓకు పనికి రాదని తీర్పు రానుంది. అసలు ఈ నివేదిక  విచారణకు ఎంత లేదన్నా  నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.  ఈ లోగా డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. సీఎంఓ తరలింపుకు కనీసం నెల రోజుల సమయం కావాలి. ఈ నెలలోనే అది మొదలైతే తప్ప డిసెంబర్ లో అక్కడ నుండి పరిపాలన మొదలయ్యే అవకాశం ఉండదు. కానీ ఇప్పట్లో ఈ వ్యవహారం తేలే పరిస్థితి కనిపించడం లేదు. సీఎంఓ ఒక్కటే రుషికొండపై ఏర్పాటు చేయాలని చూస్తుండగా.. మిగతా అధికారులకు నగరంలో పలు చోట్ల నివాసాలు వెతికి పట్టుకున్నారు. సీఎంఓను కూడా నగరంలో ఎక్కడో ఒక చోట భారీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, జగన్ అందుకు సుముఖంగా లేరు.  దీంతో విశాఖ నుంచి పాలన ముహూర్తం మరో సారి వాయిదా తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Related Posts