YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సోమేశ్ కుమార్ పై తీర్పు ఉత్కంఠ

సోమేశ్ కుమార్  పై తీర్పు ఉత్కంఠ

హైదరాబాద్, నవంబర్ 3,
క్యాట్‌ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా, తెలంగాణలో కొనసాగుతున్న ఆలిండియా సర్వీస్ అధికారుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది సోమేశ్‌కుమార్‌ కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పు అదే తరహా వివాదాలు ఎదుర్కొంటున్న ఆరుగురు అధికారులకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌తో పాటు మరో అయిదుగురు ఆలిండియా సర్వీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేసులో వెలువరించిన తీర్పే వారికి కూడా వర్తిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌ను విభజన తర్వాత ఏపీకి కేటాయించినా క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగారు. దీనిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సవాలు చేసింది. సోమేశ్‌ కుమార్‌ తక్షణం సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని గత ఏడాది హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు మేరకు ఏపీలో విధుల్లో చేరిన సోమేశ్‌ కుమార్‌కు అక్కడ ఎలాంటి బాధ్యతలు అప్పగించక పోవడంతో కొద్ది రోజుల తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సోమేశ్‌ కుమార్‌తో పాటు మరికొందరు కూడా ఇదే తరహా వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత తెలంగాణ డీజీపీతో పాటు 12 మంది ఆలిండియా సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించిన వివాదంపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లలో ప్రత్యూష్‌కుమార్‌ సిన్హా కమిటీ ఉత్తర్వులు చెల్లవంటూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం సవాలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు సోమేశ్‌కుమార్‌ వ్యవహారంలో ఏపీ క్యాడర్‌ కేటాయింపులు సబబేనంటూ తీర్పును గత ఏడాది వెలువరించింది.మిగిలిన అధికారుల వ్యవహారంపై విచారణ జరుగుతోంది. బుధవారం జరిగిన విచారణలో కేంద్రంతరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బి.నరసింహశర్మ వాదనలు వినిపించారు. డీజీపీ అంజనీకుమార్‌, రోనాల్డ్‌ రాస్‌, జె.అనంతరాము, ఎస్‌.ఎస్‌.రావత్‌, ఆమ్రపాలి, అభిలాష బిస్త్‌ల కేటాయింపులకు సోమేశ్‌కుమార్‌ వ్యవహారంలో వెలువరించిన తీర్పే వర్తిస్తుందని తెలిపారు.మిగిలిన అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లు వ్యక్తిగత అంశాలకు చెందినవని, వాటిపై వాదనలు వినిపించాల్సి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అన్ని పిటిషన్‌లపై విచారణను నవంబరు 15వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిగే లోపు పిటిషనర్లు, ప్రతివాదులు తమ వాదనలను నోట్‌ రూపంలో కోర్టుకు సమర్పించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

Related Posts