YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు వైసీపీలో విబేధాలు

చిత్తూరు వైసీపీలో విబేధాలు

తిరుపతి, నవంబర్ 3,
చిత్తూరు వైసీపీ నేతల్లో కొన్ని రోజులుగా వర్గ విభేదాలు, వైషమ్యాలు తలెత్తుతున్నాయి. ఈ విభేదాలు తాజాగా కూడా బయటపడ్డాయి. చిత్తూరులో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిక యాత్రలో నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జిల్లా పెద్దగా పేరుందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేతల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే మంత్రి పెద్దిరెడ్డి ఎక్కడ మాట్లాడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి మాట ఓ నేత పెడచెవిన పెట్టినట్లు సమాచారం. దీనికి తోడు రెండు రోజులుగా చిత్తూరులో బస్సు యాత్రకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఇతర నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల స్థలాల విషయంలో సైతం వర్గ విభేదాలు, మనస్పర్ధలు వచ్చినట్లు తెలిసింది.తొలుత చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ కొందరి నేతలకు చెప్పకుండా పలమనేరు రోడ్డు‌లో ఏర్పాటు చేయడంపై సైతం నేతల మధ్య సఖ్యత లేదనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాధికార సామాజిక బస్సుయాత్ర కార్యక్రమం చిత్తూరు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో విజయవంతం కాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సభా వేదిక వద్ద వరకు ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడక పోవడంపై పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కేవలం నేతల మధ్య వర్గ విభేదాల వల్లే మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడకుండా వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా మంత్రి రోజా చివర్లో వచ్చి అప్పుడే వెళ్లిపోవడంతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు మధ్యలోనే వెళ్లిపోయారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి సైతం ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర జరుగుతున్న బహిరంగ సభ నుంచి అనుచరులతో అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంగా మారింది.

Related Posts