YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏపీ ఫెయిల్యూర్సే... తెలంగాణ ప్రచారాలా

ఏపీ ఫెయిల్యూర్సే...  తెలంగాణ ప్రచారాలా

విజయవాడ, నవంబర్ 3,
ఏపీలో  రోడ్ల దుస్థితి..  భూముల ధరల పతనం ఇవే ఇప్పుడు తెలంగాణలో  అధికార బీఆర్ఎస్ కు ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. ఏపీలో రోడ్డెక్కితే మంచాన పడుడే.. తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు, పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారు, తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైంది, ఏపీలో పనితనం లేదు.. పగ తనమే ఉంది. ఇదీ తెలంగాణ నేతలు ఏపీ పరిస్థితి గురించి మాట్లాడిన, మాట్లాడుతున్న  మాటలు. తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్  సహా మంత్రులు, నాయకులు అందరూ   ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు,  అధఃపాతాళానికి పడిపోయిన అభివృద్ధి,  వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులను ప్రస్తావిస్తూ ఏపీని అవహేళన చేస్తూ  వ్యాఖ్యలు చేశారు. చేస్తున్నారు.సాధారణంగానే తెలంగాణ అభివృద్ధి సూచికగా ఏపీలో దిగజారిన పరిస్థితులను చూపే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ చేశారు.   బీఆర్ఎస్ నేతలు  జగన్ సర్కార్ వైఫల్యాలనే తమ పార్టీ ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఏపీలో రోడ్ల నుండి వ్యవసాయానికి అందని చేయూత వరకూ ప్రతిదీ బీఆర్ఎస్ నేతలు తమకి అనుకూలంగా వాడేసుకుంటున్నారు.నిజానికి బీఆర్ఎస్ నేతలకు ఏపీ ప్రస్తావన లేకుండా ఏ ఎన్నికలు పూర్తికావు. ఒకవైపు ఆంధ్రా పాలకుల పెత్తనంలో అన్యాయం అయిపోయామని కొందరు తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తే.. ఎ న్టీఆర్, చంద్రబాబు లాంటి వాళ్ళు తెలంగాణ సంక్షేమం, హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన వ్యక్తులని మరికొందరు ఎన్నికలవేళ ఆంధ్ర సెటిలర్లను ఆకట్టుకొనే పనిచేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయంలో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై దాదాపుగా అన్ని పార్టీల నేతలు సానుభూతి వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ నేతలైతే వెళ్లిన ప్రతిచోటా ఏపీలో కుంటుపడిన అభివృద్ధి, దిగజారిన పరిస్థితులను చూపెడుతూ బీఆర్ఎస్ కు ఓటెయ్యకపోతే మీ పరిస్థితి కూడా ఇంతే అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా  ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ సీఎం జగన్ పరిపాలన వైఫల్యాన్ని తమ పరిపాలన సామర్థ్యానికీ  కొలమానంగా  చిత్రీకరించి చెప్పుకుంటున్నారు.తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఏపీలో పరిస్థితులపై  చాలా చులకనగా మాట్లాడారు.  బీఆర్ఎస్ చేసిన  అభివృద్ధి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనీ,  మనం ఎవరితో విడిపోయామో వాళ్లే చెబుతున్నారని అన్నారు.   అవతలివాళ్ల రోడ్లు ఎలా ఉన్నాయో.. మన రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే చాలు. నేను ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు.. మీరు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు కదా! డబుల్ రోడ్ వచ్చిందంటే తెలంగాణ.. సింగిల్ రోడ్ వచ్చిందంటే అది ఆంధ్రా అనేది మీకు కనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.అంతే కాదు ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణ కటిక చీకటి అవుతుందన్నారు. కారు చీకట్లు కమ్ముకుంటాయన్నారు. ఇవాళ తెలంగాణలో వెలుగుజిలుగులు ఉంటే.. ఎవరైతే మనకు శాపం పెట్టారో వాళ్లే చీకట్లో  ఉన్నారన్నారు. తాము విడిపోతే.. రాష్ట్రాన్ని పాలించటం వస్తుందా? అంటూ వ్యాఖ్యానించారని.. ఇప్పుడు వాళ్లే వచ్చి మన దగ్గర ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు.  మన రాష్ట్రంలో ధాన్యం అమ్మితే సొమ్ము త్వరగా ఇస్తున్నాం. అందుకే వాళ్లు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారని చెప్పారు.ఇది ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు గత వారం మంత్రి హరీష్ రావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీలో పని తనం లేదని కక్షసాధింపు పాలన సాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.  అయితే  బీఆర్ఎస్ నేతలు ఎంతగా  జగన్ పాలనను చులకన చేసి మాట్లాడుతున్నా.. వ్యాఖ్యలు చేసినా వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు.  తాజాగా సీఎం కేసీఆర్ చేసిన  వ్యాఖ్యలను, బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఏపీలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇక్కడి పరిస్థితులపై చేస్తున్న వ్యాఖ్య లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు లాంటి నాయకుడిని కాదనుకోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇదని.. ఓ అసమర్ధుడిని ముఖ్యమంత్రి చేయడం వలన పొరుగు రాష్ట్రాలలో మనం పరువు పోతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు, పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఎంత అవహేళనగా జగన్ సర్కార్ వైఫల్యాలను విమర్శించినా.. వైసీపీ నేతలు, ప్రతి విషయానికీ మీడియా ముందుకు వచ్చి తనదైన స్టైల్ లో భాష్యం చెప్పే సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల నోటి వెంట కూడా ఈ కామెంట్లను ఖండిస్తూ ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. అంటే బీఆర్ఎస్ నేతలు చెబుతున్న ప్రతి మాటా, చేస్తున్న ప్రతి వ్యాఖ్యా నిజమేనని అంగీకరించినట్లేనా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

Related Posts