విజయవాడ, నవంబర్ 4,
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి దేశానికే మార్గదర్శకంగా ఉన్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తక్కువ అప్పు చేసి కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్దిదారులకు నిధులు విడుదల చేసినప్పుడల్లా చెబుతున్నారు. పేదవారికి సంక్షేమ పథకాల కోసం ఎఫ్ఆర్‌బిఎం పరిమితులకు లోబడి అప్పు చేస్తే తప్పేంటని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనికి ఉదాహరణగా 2023 జూలై 31న లోక్ సభలో ఒక ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 4.42 లక్షల కోట్లని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ.1,77,991 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాన్ని చూపుతున్నారు.వాస్తవానికి ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం తేల్చినవి కాదు. ' స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2022-23‘ పేరిట ఆర్బిఐ ప్రచురించిన గణాంకాల ఆధారంగా తామీ వివరాలు వెల్లడిస్తున్నట్లు కేంద్రం పార్లమెంటుకు ఇచ్చిన అధికారిక పత్రాల్లో స్పష్టం చేసింది. అంటే కేంద్రం వెల్లడించినా, ఆర్బీఐ తన వెబ్ సైట్లో చూపినా అవన్నీ రాష్ట్రం అందచేసిన అప్పుల లెక్కలే. అయితే ఆర్థిక మంత్రి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పబ్లిక్ అప్పులు గురించి మాత్రమే సమాచారం ఇచ్చారని, వివిధ కార్పొరేషన్ల అప్పులు, గ్యారంటీ, నాన్ గ్యారంటీ రుణాలు, పెండింగ్ బిల్లులు, బకాయిలు కలిపి రాష్ట్ర అప్పులు రూ. 11 లక్షల కోట్లు దాటిపోయాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధారాలతో సహా వివరిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త ఆర్థిక విధానాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోతోందని, అప్పు చేయనిదే రోజు గడవని పరిస్థితి దాపురించిందని ఆర్థిక నిపుణులు, ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ 2022 ఆగస్టు నెలలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టి వి సోమనాధన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు. రాజ్యాంగ నిబంధనలను, ఎఫ్ఆర్‌బిఎం చట్టాన్ని ఉల్లంఘించడమే కాక, రాష్ట్ర ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలను ఇష్టానుసారం సవరించుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల ఆడిట్ రిపోర్టులను రహస్యంగా ఉంచడం వంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బటన్ నొక్కి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం అప్పు చేస్తే విమర్శించడం ఎంతవరకు సబబు అని జగనీయులు సమర్థించుకుంటున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 జూలై 10న విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం 2019 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు (గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన బకాయిలు మొత్తం కలసి) రూ.3,62,372 కోట్లు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ బహిరంగ మార్కెట్ రుణం సుమారు రూ.4,90,000 కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన కార్పొరేషన్ల రుణం (ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం మార్చి 2022 వరకు) రూ.1,89,700.63 కోట్లు, నాన్ గ్యారంటీ రుణాలు (మార్ట్ గేజ్ ) రూ.94,928 కోట్లు, పెండింగ్ బిల్లులు, విద్యుత్ డిస్కంలకు బకాయిలు రూ .1,95,000 కోట్లు, ప్రభుత్వ సంస్థల నుండి తీసుకున్న డిపాజిట్లు, గ్రామ పంచాయతీల నుండి దారి మళ్లించిన నిధులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఎస్సీ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ల నుంచి వాడేసిన వేల కోట్ల నిధులు మొత్తం కలిపితే ప్రస్తుత రాష్ట్ర అప్పులు, బకాయిలు రూ.11 లక్షల కోట్ల పైమాటే అంటున్నారు ఆర్థిక నిపుణులు. దీనిలో గత ప్రభుత్వాలు చేసిన అప్పులు (2019 జూలై 10న శ్వేత పత్రం ప్రకారం) తీసివేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పు రూ.7,37,628 కోట్లు. మరి సంక్షేమం కోసం రూ.2,35,000 కోట్లు ఖర్చు చేశామని ఇటీవలే ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమే అనుకున్నా మిగతా అప్పు సుమారు రూ.5 లక్షల కోట్లు ఏమైనట్లు దేనికి ఖర్చు చేసినట్లు? ఎదురు దాడి కాకుండా ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకుల మీదుందిఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్పొరేషన్ల వ్యవహారం కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా)కు కూడా అంతుచిక్కని బ్రహ్మ పదార్థంలా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని అనుసరించి కేంద్రం నిర్దేశించిన పరిమితికి లోబడి మాత్రమే అప్పులు తెచ్చుకొని రాష్ట్రాన్ని నడపాలి. సమస్త రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఉచిత సంక్షేమ పధకాల ఖర్చులు కూడా ఇందులోనే ఉండాలి. ఒకవేళ ఖర్చులు పెరిగి, ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పుల కోసమే కార్పొరేషన్లు సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోంది. ఏపీలో అనేక కార్పొరేషన్ రుణాలు తీసుకున్నా వాటికి ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఒకవైపు పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కార్పొరేషన్ల పేరుతో అప్పు చేయడం కోసం కేంద్రానికి తెలియపరచకుండా ఎఫ్ఆర్‌బిఎం చట్టానికి, ఇతర చట్టాలకు స్వంత సవరణలు చేసుకుంటూ కార్పొరేషన్లకు ఇచ్చే అప్పుల గ్యారంటీ పరిమితిని 90 శాతం నుండి ఏకంగా 180 శాతానికి పెంచి ఎడాపెడా దొడ్డిదారిన అప్పులు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పైగా యధేచ్చగా కార్పొరేషన్ల ద్వారా అప్పు తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా స్వంతానికి వాడుకుంటోంది. రాజ్యాంగానికి, చట్టాలకు జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వం బ్యాంకుల సాయంతో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలను కాపాడడంలో అత్యంత ముఖ్యమైన ఎఫ్ఆర్‌బిఎం చట్టం, ఆర్టికల్ 293, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికరణాలు యథేచ్ఛగా ఉల్లంఘించి రోజుకో రీతిన ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని తెలుగుదేశం ఘాటుగా విమర్శిస్తోంది. ఇవే నేరాలు ప్రైవేటు రంగంలో జరిగితే ఈడీ,సీబీఐ రంగంలోకి దిగి కేసులు పెట్టేవారని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 118 కార్పొరేషన్లలో చురుకుగా పనిచేస్తున్న 97 సంస్థలలో విద్యుత్ రంగానికి చెందిన 40 సంస్థలే పూర్తి స్థాయిలో అకౌంట్స్ సమర్పించాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 57 కార్పొరేషన్లు కాగ్‌కు అకౌంట్స్ ఎందుకు సమర్పించ లేదు? ఈ గోప్యత దేనికోసం? ఎందుకని ప్రాధాన్యమైన స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లతో సహా అనేక సంస్థలు గత నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా ఆడిట్ చేయించలేదు.ఇక అప్పు చేసి మరీ సంక్షేమం అమలు చేస్తున్నామన్న అధికార వైసీపీ వాదన నిజాయతీ లేనిది. సంక్షేమ పథకాల కోసం అప్పు చేస్తున్నామన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన ఆదాయం రూ.9,24,500 కోట్లలో సుమారు రూ.2,35,000 కోట్లు (25.42%) సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే, రాష్ట్ర విభజన ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన ఆదాయం రూ.6,15,960 కోట్లలో రూ.2,78,491 కోట్లు (45.21%) సంక్షేమ పథకాల కోసం వెచ్చించారనేది కాదనలేని సత్యం. 2014-15 నుంచి 2018-19 మధ్య తెలుగుదేశం హయాంలో కేంద్రం పన్నుల వాటా కింద (రూ.1,25,245 కోట్లు), గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద (రూ.1.09,270 కోట్లు) రూ.2,34,515 కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తే, 2019-20 నుంచి 2023-24 (బడ్జెట్ అంచనాల వరకు) వైకాపా హయాంలో రూ.3,54,727 కోట్ల (కేంద్ర పన్నుల వాటా రూ.1,67,603 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.1,87,124 కోట్లు) కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. మరి గత ప్రభుత్వం కంటే అదనంగా కేంద్రం పన్నుల వాటా, గ్రాంట్లు పెరగడం ద్వారా లభించిన రూ.1,20,212 కోట్లు, పెంచిన చార్జీలు, వడ్డించిన పన్నుల వలన చేకూరిన రెండు లక్షల కోట్ల అధిక ఆదాయం కూడా చాలక బటన్ నొక్కుడు కోసం లక్షల కోట్లు అప్పు చేసామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయంలో మన రాష్ట్రం అట్టడుగున నిలవడం ఆర్థిక అరాచకానికి పరాకాష్టగా నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రంలో రెవెన్యూ లోటు అంచనాలను మించిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న రూ.13 వేల కోట్ల రెవెన్యూ లోటును రూ.48 వేల కోట్లకు, రూ. 20 వేల కోట్లుగా ఉన్న ద్రవ్య లోటును రూ.60 వేల కోట్లకు చేర్చడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులో అంతా తిరిగి ఆదాయం సృష్టించలేని వాటికే వెళ్లి, రుణాలు వడ్డీ చెల్లింపులకే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కలపై కాగ్ తీవ్ర అభ్యంతరం తెలిపి, వైసీపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో దుర్మార్గమైన తప్పులు చేస్తోందని ఎత్తి చూపింది. ఇటువంటి తీవ్ర విమర్శలకు సమాధానం చెప్పి, ప్రజలకు నిజానిజాలు తెలియపరచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి ఆర్థిక నిపుణులు, పెట్టుబడిదారులు, రాష్ట్ర ప్రజల సందేహాలను నివారించి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను నిలబెట్టాలి.