తిరుపతి, నవంబర్ 6,
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్షర్మిల తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్కుటుంబంపై కేసులు పెట్టిన పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించడం వెనుక మర్మమేమిటనేది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆమె జగనన్న వదిలి బాణమేనంటూ రాజకీయ వర్గాల నుంచి ఛలోక్తులు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదనే అంచనాతో షర్మిలతో కాంగ్రెస్‌లో కర్చీఫ్వేయించినట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. నాడు షర్మిల అరెస్టు సమయంలో ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. ఇప్పుడు బీజేపీ ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణ కోడలిగా తన రాజకీయ భవిష్యత్తును అక్కడే తేల్చుకోవాలని షర్మిల భావించారు. అందుకనుగుణంగా వైఎస్సార్‌టీపీకి శ్రీకారం చుట్టారు. నెలల తరబడి పాదయాత్ర చేశారు. సంప్రదాయ కాంగ్రెస్పార్టీ శ్రేణులు తనకు తోడుగా వస్తాయని ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదు. షర్మిలకు ఇప్పటిదాకా బీజేపీ, బీఆర్ఎస్లోపాయికారీ సహకారం అందించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. కర్నాటకలో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంచనాలను తల్లకిందులు చేస్తూ పైకి ఎదిగింది.ఎన్నికల నాటికి వైఎస్సార్‌టీపీ పుంజుకునే అవకాశాల్లేవు. దీంతో కాంగ్రెస్‌లో విలీనం చేయాలని తొలుత ప్రతిపాదించారు. షర్మిల వల్ల తెలంగాణలో ఒనగూడే ప్రయోజనం లేదని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించింది. ఇక్కడ సోదరుడు జగన్‌కు వ్యతిరేకంగా పోరాడడం ఆమెకు ఇష్టం లేదు. కనీసం పాలేరు టిక్కెట్ కేటాయించాలని షర్మిల అడిగారు. అందుకూ కాంగ్రెస్ నుంచి స్పందన రాలేదు. చివరకు బేషరతుగా కాంగ్రెస్పార్టీకి మద్దతు ప్రకటించారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఆమె నిర్ణయంపై ఇక్కడ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడతారని అంతా భావించారు. వైఎస్సార్కుటుంబాన్ని కేసులతో వేధించిన పార్టీకి ఎలా మద్దతిస్తారని కన్నెర్ర జేస్తారని అనుకున్నారు. అవేం జరగలేదు. ఆమె పార్టీ.. ఆమె ఇష్టమంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని పొడి పొడి వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ఎత్తుగడ మేరకే కాంగ్రెస్పార్టీకి షర్మిల మద్దతు ఇచ్చి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె ఇప్పటికీ జగనన్న వదిలిన బాణమేనంటున్నారు. తెలంగాణలో మాదిరిగా దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నట్లు కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కుటుంబం దూరంగా లేదని సంకేతాలు ఇచ్చేందుకు షర్మిల ద్వారా పావులు కదుపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక సతమతమవుతున్న బీజేపీ, బీఆర్ఎస్‌కు షర్మిల నిర్ణయంతో పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు.