ఖట్మాండు, నవంబర్ 6,
నేపాల్‌లో సంభవించిన భూకంపంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు పేకమేడల్లా కూలిపోయాయి. నిన్న (శుక్రవారం) రాత్రి ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం నేపాల్‌లోని అయోధ్యపురికి ఉత్తరాన 227 కిలోమీటర్లు, ఖాట్మండుకు పశ్చిమ-వాయువ్యంగా 331 కిలోమీటర్ల దూరంలో... 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. భూకంప తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదయ్యింది. నేపాల్‌పై తీవ్రస్థాయిలో ఇచ్చిన భూప్రకంపనలు... ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పాకాయి. ఆయా రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది.నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 128మందికిపైగా మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డవారికి ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే... అక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది. రాత్రి భూమి కంపించగానే.. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. రాత్రంతా ప్రజలు రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొన్ని చోట్లు కొండచరియలు విరిగిపడటం వల్ల... పలు ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకోలేకపోతున్నాయి. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్‌లో ఇలాంటి భూకంప ప్రకంపనలను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. నేపాల్‌లో ఇంతకుముందు కూడా భూకంపాలు సంభవించాయి. 2015లో ఇచ్చిన భూకంపంలో... 8 వేల మంది మరణించారు. నేపాల్‌లోనే తరచూ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి. అక్కడి భూమి కింద ఏముంది..? ఇప్పుడు చూద్దాం.నేపాల్‌లో 17 శాతం ప్రాంతం మాత్రమే చదునుగా... అంటే ఏకరీతిగా ఉంటుంది. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. మైదాన ప్రాంతాన్ని తెరాయి అంటారు. నేపాల్‌కు ఉత్తరం వైపున చివరలో ఎత్తైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. భూగోళిక భూగర్భ శాస్త్రం ప్రకారం... భూమి యొక్క క్రస్ట్ పెద్ద టెక్టోనిక్ ప్లేట్‌లతో రూపొందించబడింది. ఈ టెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. నేపాల్.. అలాంటి రెండు పెద్ద టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. దీని వల్ల... ఈ రెండు పలకలు ఢీకొన్నప్పుడు నేపాల్‌లో భూకంపాలు వస్తాయి.రెండు ప్లేట్లు ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ... ఒకదానికొకటి ఢీకొంటాయి. దీని కారణంగా నేపాల్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ రెండు పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. నేపాల్ పెద్ద సమస్య... అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి భూకంప ప్రకంపనలను తట్టుకోలేవు. అందుకే భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతోంది. నేపాల్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ సంతాపం ప్రకటించారు. వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ భూకంపంలో జజర్‌కోట్ జిల్లాలోని నల్‌గఢ్ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్ సరితా సింగ్ కూడా మృతిచెందారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న ఇల్లు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.