రాంచీ నవంబర్ 6
సొంతగడ్డపై జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ లో భారత మహిళల హాకీ జట్టు విజేతగా నిలిచింది. రాంచీలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో జపాన్ పై 4-0తో గెలుపొంది.. రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. మరంగ్ గొమ్కే జైపాల్ సింగ్ అస్ట్రో టర్ఫ్ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. భారత ప్లేయర్ల దూకుడు ముందు గట్టి పోటీనిస్తుందనుకున్న జపాన్ జట్టు తేలిపోయింది.సంగీత కుమారి, నేహా గోయల్, లర్లెమ్‌సియామి, వందనా కటారియాలు తలొక గోల్ చేయడంతో టీమిండియా అలవోకగా గెలుపొందింది. భారత జట్టు 2016లో మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది. ఆ ఏడాది సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో చైనాను 2-1తో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.