YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖాళీ అవుతోన్న "గులాబీ కారు"

ఖాళీ అవుతోన్న "గులాబీ కారు"

అశ్వారావుపేట,
"కారు"కు పంక్చర్ అయ్యిందో లేదా ఇంజన్ కరాబ్ అయ్యిందో  తెలియదు గానీ... అందులో ప్రయాణిస్తున్న ప్రయాణి(నాయ)కులు ఒక్కొక్కరు దిగి పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాకు ఎదురు గాలులు వీస్తున్నాయనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతోంది. ఇక్కడ పార్టీ నాయుకులు ఒక్కొక్కరిగా తన అనుచరులతో కలిసి రాజీనామాలు చేయటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో  కలవరం మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయుకులు అంతేగాకుండా అన్నపురెడ్డిపల్లి, చుండ్రుగొండ, ములకలపల్లి,  దమ్మపేట, అశ్వారావుపేట సర్పంచులు,  ఎంపీటీసీలు అధిక సంఖ్యలో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసిన విషయం విధితమే. రోజు వరుసగా  కార్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయుకులు, ప్రజా ప్రతినిధులను కార్యకర్తలను చేజారకుండా అదుపు చేయటంలో పూర్తిగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు  విఫలం చెందారని కార్యకర్తలు, పలువురు బహిరంగంగానే చెబుతున్నారు.
నియోజకవర్గ స్థాయిలో మెచ్చాకి నాయుకులకు సమన్వయ లోపం, ఆయన అసమర్ధతోనే  బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిందని కార్యకర్తలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా మెచ్చా మేల్కొని పార్టీ బలహీనతను గుర్తించి మండల, గ్రామ స్థాయిల్లో నాయకులను సమన్వయం చేసి వారికి ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పజెప్పకపోతే పార్టీకి కోలుకోలేని దెబ్బ పడనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పొంగులేటిని వదులుకున్న దౌర్భాగ్యమేనా...!?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గులాబీ కారు స్పీడుకు, జోరుకు కారకుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కారు నుంచి దిగేలా చేయటం బీఆర్ఎస్ పార్టీ దౌర్భాగ్యమేనని పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పొంగులేటి స్థానం కారుకు ఇంజన్ లాంటి వారని, ఇక ఇంజన్ కరాబ్ అయితే కారు ముందుకు ఎలా సాగుతుందని ఆయన అనుచరులు చెప్పడం అతిశయోక్తి కాదేమో. పొంగులేటి ఎటువైపు ఉంటే గెలుపు అటు వైపు ఉంటుందని, అలాంటిది ఇప్పుడు పొంగులేటి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అశ్వారావుపేట నియోజకవర్గం మొత్తం గడపగడపకు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా ప్రచారం నిర్వహించారు.
దీంతో ప్రతి ఒక్క ఓటరు పార్టీ ఏదైనా కానీ శీనన్న మాతో ఉంటే చాలు అనే రీతిలో పరిస్థితులను తమ వైపు మల్చుకున్నారనడంలో సందేహం అక్కర్లేదు. దీంతో అశ్వారావుపేట నియోజకవర్గం "హస్త"మయం కానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
బీఆర్ఎస్ లో తీవ్రరూపం దాలుస్తోన్న అసమ్మతులు...
బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతులు తారా స్థాయికి చేరుకున్నాయి. సీనియర్ నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా ఛోటా నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యతనివ్వడమే ప్రధాన కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. చిలికి చిలికి గాలి వానలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పాకింది. ఫలితంగా నియోజకవర్గాల్లో విభేదాలు బహిర్గతమవుతోన్నాయి. దీని పర్యవసనమే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల సొంత పార్టీ నేతల మధ్య ఎడ మొహం పెడ మొహం వేసుకుని పార్టీ బలాన్ని పెంచడానికి బదులు మరింత బలహీన పర్చుకుంటున్నారు. ఇంత జరుగుతోన్న ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండటంతో పాటు అధిష్ఠానం అలసత్వం వహించడం కారు స్పీడు తగ్గడానికి ప్రధాన కారణమని పార్టీ శ్రేణులే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. ఒక వైపు ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి వరసగా రాజీనామాల పర్వం మాత్రం ఆగడం లేదు.
 "పేట" సెంటిమెంట్ రిపీట్  కానుందా...!?
అశ్వారావుపేట నియోజవర్గం ప్రజలు కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటిదే ఈ సారి గులాబీ కారుకు బ్రేక్ వేసి... మెచ్చాకు నో చెప్పి... పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో "చేయి" కలుపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో అశ్వారావుపేట నియోజవర్గం ప్రజలు ఇచ్చిన ఫలితాలను పరిశీలిస్తే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొత్తగా అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడిన సమయంలో 2009లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే  ఈ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా అశ్వారావుపేట నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఒగ్గిల మిత్ర సేన గెలుపొందారు. రెండోసారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒగ్గిల మిత్రసేన ఓడిపోయారు. మూడోసారి 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరావు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. తాటి వెంకటేశ్వర్లు ఓడిపోయారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని శాసించే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావులు కారు దిగి మరీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే  బీఆర్ఎస్ పార్టీకి ఎదురు గాలి వీస్తుందని చెప్పక తప్పదు. అశ్వారావుపేట నియోజవర్గం ఏర్పడి నుంచి ఇప్పటివరకు ఒకసారి గెలిచినా ఎమ్మెల్యే రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. 2024 ఈ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫలితాలు ఈ సారి ఎన్నికల్లో కూడా "పేట" సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని రాజకీయ విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు.

Related Posts