YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీడీపీ ఓట్ల కోసమేనా..పొత్తు

టీడీపీ ఓట్ల కోసమేనా..పొత్తు

హైదరాబాద్, నవంబర్ 7,
తెలంగాణలో అసెంబ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతుంటే... కారుకు బ్రేకులు వేయాలని హస్తం పార్టీ ఎత్తులు వేస్తోంది. తెలంగాణ విజయం సాధించి..దక్షిణాదిన కాషాయ జెండాను రెపరెపలాండించాలని బీజేపీ పైఎత్తులు వేస్తోంది. కమలం పార్టీ, జనసేన పొత్తుపై తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జస్ట్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. హిందూత్వవాది రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో దుబ్బాకలో రఘునందన్ రావు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో బీజేపీ బలం మూడుకు చేరుకుంది.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందని భావించినా అది జరగలేదు. శాసనసభ ఎన్నికల్లో జనసేనకు తొమ్మిది సీట్లను కేటాయించింది. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించింది. ఇరు పార్టీల నేతల చర్చల 9 స్థానాలకు అంగీకారం కుదిరింది. కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్‌, కోదాడ, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించినట్టు సమాచారం. శేరిలింగంపల్లి స్థానంపై ఇంకా పీటముడి వీడలేదు. శేరిలింగంపల్లి కోసం జనసేన పట్టుబడుతోంది. బీజేపీలోనూ శేరిలింగంపల్లి స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తర్వాత శేరిలింగంపల్లి సీటుపై క్లారిటీ వచ్చే అవకాశముంది. బీజేపీ, జనసేన పొత్తుపై తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. 2018లో రెండు సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంది. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా సైలెంట్ అయింది. పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోయినా, ప్రతి జిల్లాలో, నియోజకవర్గాల్లో ఇప్పటికి చెక్కుచెదరని ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, జనసేన కలిసి బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు ఈ కూటమి వైపు మళ్లితే మెజార్టీ సీట్లు సాధించవచ్చన్న ధీమాలో బీజేపీ, జనసేన నేతలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు భారీగా ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ సాలిడ్ గా కూటమికి పడతాయన్న లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకు 9 చోట్ల జనసేన బరిలోకి దిగనుంది. 22 స్థానాలకు కాషాయ పార్టీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనుంది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు.

Related Posts