YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సుప్రీంకు ఓట్ల తొలగింపు రచ్చ

సుప్రీంకు ఓట్ల తొలగింపు రచ్చ

విజయవాడ, నవంబర్ 8,
ఏపీలో నకిలీ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపుపై కొంతకాలంగా రచ్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఇలా చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. గతంలో టీడీపీ చేసింది కూడా ఇదే కదా అని అధికార పార్టీ చెబుతోంది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్చంద సంస్ధ ఈ నకిలీ ఓట్ల నమోదు, ఇతర అక్రమాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా తయారీలో వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శుల సాయంతో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంస్ధ దాఖలు చేసిన ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసుగా సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. అయితే ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అర్ధాంతరంగా తప్పుకున్నారు.గతంలో ఏపీ హైకోర్టులో అమరావతి సహా పలు కేసుల విచారణలో జడ్జిగా ఉన్న మాజీ ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇప్పుడు ఏపీలో నకిలీ ఓట్ల కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో గతంలో ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన కారణంగా ఆయన తప్పుకున్నారా లేక మరో కారణమా అన్నది తెలియరాలేదు. కానీ కీలకమైన నకిలీ ఓట్ల కేసు విచారణ నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవడం మాత్రం సుప్రీంకోర్టులో చర్చనీయాంశంగా మారింది.మరోవైపు ఏపీ నకిలీ ఓట్ల కేసు విచారణ నుంచి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుకోవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దీనిపై స్పందించారు. ఈ కేసును మరో బెంచ్ కు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బీఆర్ గవాయ్ దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో జడ్జిని కలుపుకుని ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.

Related Posts